గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి పాశవికంగా యువతిని హతమార్చి గుంతలో పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దుండగులు

Updated on: Oct 04, 2020 | 11:11 AM

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి పాశవికంగా యువతిని హతమార్చి గుంతలో పూడ్చిపెట్టారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కోట్‌పల్లి మండలంలోని అన్నసాగర్‌ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం మేకల కాపరులు తిరుగుతుండగా, వీధికుక్కలు పూడ్చిఉన్న ఓ మృతదేహాన్ని వెలికితీస్తున్నాయి. ఇది గమనించిన కాపరులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న వికారాబాద్‌ పోలీసులు ఓ గోనెసంచిలో యువతి మృతదేహాన్ని ఉంచి దాని చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి గుంతలో పూడ్చినట్టు గుర్తించారు. రాత్రి 11.30 సమయంలో తవ్వి బయటకు తీసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమె హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వయసు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటుందని, 4.5 అడుగుల ఎత్తు, శరీరంపై నైటీ, జాకెట్‌, ఎడమ చేతికి ఆకుపచ్చ గాజు, ఎడమ కాలికి పట్టీ, మెడలో రోల్డ్‌గోల్డ్‌ గొలుసు ఉన్నాయని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు.