Student tries to shoot principal: ఆ విద్యార్థికి పట్టుమని 15 ఏళ్లు కూడా నిండలేదు.. పాఠశాలలో తరచూ గొడవలు.. ఉపాధ్యాయులతోనే వాగ్వాదానికి దిగేవాడు..10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై అతనిపై అనేక మంది ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో ప్రిన్స్‌పాల్ పాఠశాల నుంచి (ఎక్స్ పెల్) బహిష్కరించారు. దీంతో ఆ విద్యార్థికి కోపం వచ్చింది. ప్రిన్స్‌పాల్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహించిన ఆ విద్యార్థి ఒక నాటు తుపాకీ తీసుకొని వచ్చి ప్రిన్సిపాల్‌ను కాల్చడానికి ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ధోల్‌పూర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15ఏళ్ల విద్యార్థిని ఎక్స్‌పెల్ చేశారు. ఏడాది క్రితం తనను అన్యాయంగా ఎక్స్‌పెల్ చేశారంటూ.. తుపాకీతో పాఠశాలకు వచ్చిన ఆ విద్యార్థి నేరుగా ప్రిన్సిపాల్ భగవాన్ త్యాగి కార్యాలయానికి వెళ్లి కాల్చడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
ప్రిన్సిపాల్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గన్ జామ్ కావడంతో ఫైరింగ్ జరగలేదని పోలీసులు తెలిపారు. వెంటనే ప్రిన్సిపాల్ అలారం మోగించడంతో అప్రమత్తమైన సిబ్బంది.. అతన్ని పట్టుకున్నారని తెలిపారు. ఆ తరువాత సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నట్లు ధోల్పూర్ ఎస్పీ కేసర్ సింగ్ తెలిపారు. కాగా.. అతన్ని ఏడాది క్రితమే.. పాఠశాల నుంచి బహిష్కరించగా.. అతని బంధువును తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చినట్లు పేర్కొంటున్నారు.
Also Read: