Prakasam District: ఆన్‌లైన్ గేమ్స్ ఎందరినో వ్యసనంగా మారుస్తున్నాయి. చాలామంది డబ్బులు పెట్టి మరి ఆన్‌లైన్ గేమ్స్ ఆడి సర్వం కోల్పోతున్నారు. తాజాగా.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి చోటుచేసుకుంది. స్మార్ట్ ఫోన్లో ఆన్‌లైన్ గేమ్‌కి అడిక్ట్ అయిన చిన్నికృష్ణ అనే 18 ఏళ్ల యువకుడు.. దాదాపు రెండు లక్షల రూపాయలు అప్పులో కూరుకుపోయి చివరికి తనువు చాలించాడు. కనిగిరి పట్టణం శంకరానికి చెందిన రమణయ్య, నారాయణమ్మలకు ఇద్దరు పిల్లలు. వారిది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. వీరి కుమారుడు చిన్నికృష్ణ ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటానంటూ 6 నెలల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి కుదిరాడు.
ఈ దశలోనే ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యాడు. గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోవడం.. అప్పులు తీసుకోవడం మళ్లీ డబ్బులు కోల్పోవడం జరిగింది. ఇలా రెండు లక్షల రూపాయల వరకు అప్పు పేరుకుపోయింది. అందులో లక్షా 60 వేల రూపాయలు అప్పు చెల్లించాడు. మిగతా 40 వేల రూపాయలు కట్టమని సదరు సంస్థ ప్రతినిధులు ఒత్తిడి తేవడంతో, సొంత ఊరు కనిగిరికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కుమారుడు ఈ విధంగా చనిపోవడం చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ ఘటనతో కనిగిరిలో విషాదం అలుముకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..