Police Arrested BJP Leaders : చలో బైంసా నేపథ్యంలో బైంసాకు తరలి వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విశ్వహిందూ పరిషత్ నాయకులు నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి దోమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో టోల్‌ప్లాజా దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఇప్పటికే బైంసాలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
నిర్మల్ జిల్లా బైంసా లో ఆదివారం రాత్రి జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంఘటనే ఈ అల్లర్లకు కారణం. ఈ ఘర్షణల్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు ఇద్దరు రిపోర్టర్లు, ఇద్దరు పోలీసులు, ఏడుగురు స్థానికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఈ అల్లర్లకు కారణంగా తెలుస్తోంది. జుల్ఫేర్ గల్లీలో మొదలైన ఈ ఘర్షణ ఆ తరువాత కుబీర్ రోడ్డు, గణేష్ నగర్, మేదర్ గల్లీ బస్టాండ్ ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.