NCRB data for Childrens suicide: ఆధునిక ప్రపంచంలో దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతోపాటు కొంతమంది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వీరిలో చిన్నారులు సైతం ఉన్నారు. పరీక్షల్లో పాసవ్వలేదనో, తల్లిదండ్రులు తిట్టారనో, ఫోన్ ఇవ్వలేదని, టీవీ చూడలేదని.. ఆటలు ఆడుకోనివ్వడం లేదని.. ఇలా పలు కారణాల వల్ల చిన్నారులు క్షణికావేశంలో ప్రాణాలు బలి తీసుకొని కుటుంబాలకు గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే.. దేశంలో గత మూడేళ్ల వ్యవధిలోనే (2017 నుంచి 2019) 24వేల మంది టీనేజర్లు (14-18ఏళ్ల వయస్సు కలవారు) ఆత్మహత్యకు పాల్పడినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. ఎన్‌సీఆర్‌బీ తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంతోనే దాదాపు 4,046 మంది ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో టీనేజర్ల ఆత్మహత్యలకు సంబంధించి ఈ మేరకు ఎన్‌సీఆర్‌బీ పార్లమెంటుకు పలు సంచలన విషయాలను వెల్లడించింది.
2017-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 24,568 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది. వారిలో 13,325 మంది బాలికలు ఉన్నారు. కేవలం 2017లోనే 8,029 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018లో 8162, 2019 సంవత్సరంలో 8,377 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిపింది. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లోనే 3,115 మంది ప్రాణాలు తీసుకున్నారు. అనతరం పశ్చిమబెంగాల్‌లో 2,802 మంది చిన్నారులు, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది టీనేజర్లు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపింది.
మూడేళ్లలో చోటుచేసుకున్న మరణాల్లో పరీక్షల్లో తప్పడం వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల అధికమంది మరణించారని తెలిపింది. వివాహాలకు సంబంధించి 639 మంది మృతి చెందగా.. వారిలో 411 మంది బాలికలు ఉన్నారు. 3315 మంది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాలతో మరణించగా.. 2,567 మంది అనారోగ్యంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఈ మరణాల్లో సన్నిహితులు మరణించడం, మద్యానికి బానిసగా మారడం, అక్రమ గర్భం, నిరుద్యోగం, పేదరికం లాంటి కారణాలు కూడా ఉన్నాయని తెలిపింది.
అయితే.. కౌమారదశలో ఉన్నపిల్లలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయని బాలల హక్కుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని పేర్కొంటున్నారు. కావున చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై తల్లీదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే అవగాహన కల్పించాలని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
Also Read: