రోడ్డు ప్రమాదాలు మరణమృదంగం మోగిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా గత ఏడాదిన్నరగా వాహనాలు రోడ్డెక్కకపోవడంతో ప్రమాదాలు నెమ్మదించాయి. గడిచిన కొద్దిరోజులుగా అధికమవుతున్నాయి. ఇటీవలికాలంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే అతి వేగం కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ప్రమాదం అలాంటిదే.
మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లున్న ఓ కారు రెండు లారీ కంటెనర్ల మధ్య వచ్చింది. వారి వెనుకే వస్తున్న ఓ లారీ అదుపు తప్పి ముందున్న కారును ఘోరంగా ఢీకొట్టింది. అంతే రెండు లారీ కంటెనర్ల గ్యాప్ నుంచి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ కింద పడ్డ కారు నుజ్జునుజ్జు అయింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో లారీ కారుపైకి దూసుకురావటంతో ఈ ప్రమాదం చేటు చేసుకుంది. గురువారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం ఘటనలో మృతి చెందినవారిలో నాలుగేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.