ఫ్యాక్షనిస్టులు కూడా తమ ప్రత్యర్థుల్ని అంత దారుణంగా హత్య చేయరు. కానీ ఓ వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వృద్దురాలిని హత్య చేసి.. దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన 85 ఏళ్ల ఓబులమ్మను.. అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం డబ్బులు కావాలని కృష్ణమూర్తి.. వృద్ధురాలు ఓబులమ్మను అడిగాడు. డబ్బులు లేవని ఓబులమ్మ చెప్పడంతో.. నీ దగ్గర ఉన్న బంగారం ఇస్తే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని.. తర్వాత తానే తాకట్టు నుంచి బంగారం విడిపిస్తానని కృష్ణమూర్తి నమ్మబలికాడు. బంగారం తాకట్టు పెట్టిన కృష్ణమూర్తి డబ్బులు తీసుకొని వాడుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు బంగారం విడిపించమని ఓబులమ్మ అడిగినా.. కృష్ణమూర్తి విడిపించడం లేదు. ఓబులమ్మ నుంచి ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు వృద్ధురాలు ఓబులమ్మ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు.
డబ్బులు ఇస్తామని మాయమాటలు చెప్పి ఓబులమ్మను బైక్ మీద ఎక్కించుకొని పొలం దగ్గరకు తీసుకెళ్లాడు కృష్ణమూర్తి. పొలంలోనే వృద్ధురాలు ఓబులమ్మను హత్య చేసి.. ఆనవాళ్లు కనపడకుండా వృద్ధురాలు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. తల, మొండెం, కాళ్లు, చేతులు అన్నీ ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో వేసి పెన్నా నదిలో పడేశారు. ఏమీ తెలియనట్లు కృష్ణమూర్తి.. వృద్ధురాలు ఓబులమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు కృష్ణమూర్తి అతను కుటుంబ సభ్యులే ఓబులమ్మను హత్య చేసినట్లు గుర్తించారు. ఓబులమ్మ అడ్డు తొలగించుకుంటే అప్పు తీర్చే అవసరం లేదు. అదే విధంగా ఆమెకు ఉన్న భూమి కూడా తన సొంతం అవుతుందన్న దురాశతోనే కృష్ణమూర్తి ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరిన్ని నేర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..