శ్రీశైలంలో చిమ్మ చీకట్లో కనిపించీ కనిపించనట్లు మిణుమిణుకుమంటున్న ఈ దృశ్యాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. టపాసులు కావు విమానాల లైట్లు అంతకన్నా కాదు.. కానీ ఇలా మెరిసి అలా మాయమవుతున్నాయి. ఎందుకిలా అన్నది అంతుపట్టడం లేదు. దేశ సరిహద్దులకు అవతల ఇప్పటికే డ్రోన్ల కలకలం కలవరపెడుతోంది. ఈ క్రమంలో శ్రీశైలంలో, నల్లమల అటవీప్రాంతంలో అదీ టెంపుల్ పరిసరాల్లో.. దానికి ఆనుకుని ఉన్న డ్యామ్‌పై డ్రోన్లు తిరగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో శ్రీశైల క్షేత్రంపై డ్రోన్ కెమెరాల చక్కర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు కర్నూలు జిల్లా పోలీసులు. శ్రీశైలంలోనే మకాం వేసిన కర్నూలు ఎస్పీ పకీరప్ప.. దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీతో ఈ వ్యవహారంపై ఎస్పీ పకీరప్ప మాట్లాడారు. అయితే శ్రీశైలంలోని కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డ్రోన్లకు నైట్ విజన్ కెమెరాలు అమర్చారా ? ఆ నైట్ విజన్ కెమెరాలతో జరగుతున్న రెక్కీ ఏంటి? అధికారికంగా తిరిగిన డ్రోన్లు అయితే ఈ పాటికే అందుకు సంబంధించిన సమాచారం రావాలి. కానీ అలాంటిదేం లేదని అధికారులే చెబుతున్న పరిస్థితి. అర్థరాత్రి చక్కర్లు కొడుతున్న డ్రోన్‌లను పట్టుకునేందుకు టెంపుల్, పోలీస్ సింబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ మెరుపులా మెరిసి తప్పించుకుంటున్నాయి. ఒక చోట డ్రోన్లు ఎగరవేయాలీ అంటే ఆ దరిదాపుల్లోనే దాని ఆపరేటర్ ఉండి ఉండాలి. ఇంతకీ వాళ్లెవరు? ఏం టార్గెట్‌గా డ్రోన్‌లు ఎగరవేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు.
అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ ఆపరేటర్ బాగా ఎక్స్ పర్ట్ అన్న చర్చ నడుస్తోంది. అందుకే సిబ్బంది గుర్తించి వెంబడించే లోపే అడవుల్లోకి వెళ్లిపోతున్నాయి. అసలు నైట్ టైమ్లోనే ఎందుకు వస్తున్నాయి? చిమ్మని చీకట్లో ఏం క్యాప్చర్ చేస్తున్నాయన్నది మిస్టరీగా మారింది. అప్రమత్తమైన పోలీసులు సత్రాలు, దేవస్థాన వసతి విభాగాల్లో తనిఖీలు చేపట్టారు.
పోలీసులు మాత్రం ప్రాజెక్ట్ దగ్గరికి ఎవర్నీ అనుమతించడం లేదన్నారు. క్షేత్ర పరిధిలో పురావస్తు, ఫారెస్ట్ అధికారులంతా అలర్ట్‌గా ఉన్నారని చెబుతున్నారు. అయితే డ్రోన్ల చక్కర్ల మిస్టరీ కొనసాగుతున్న వేళ.. బీజేపీ ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీశైలంలో స్లీపర్ సెల్స్ ఉన్నారని.. దేవస్థానం, డ్యామ్ కి ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో మరింత అలర్టయిన పోలీసులు అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు.