గ్యాంగస్టర్ నయీం. ఈ పేరు గుర్తుంది కదూ. సెటిల్‌మెంట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి.. ఏళ్ల తరబడి ఏలిన ఓ క్రిమినల్. అతని ఆగడాలకు కొంతమంది ప్రాణాలను కోల్పోతే.. అనేక మంది తమ ఆస్తులను కోల్పోయారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత.. అతని వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారనుకుంటే అదీ జరగలేదు. బాధితులకూ న్యాయం దక్కలేదు. అయితే నయీం ఎన్‌కౌంటర్ జరిగి ఐదేళ్లవుతున్నా.. ఇంత వరకు కేసు కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటీ…? సిట్ చేసిన దర్యాప్తులో ఏం తేలింది…? నయీంతో అంటకాగిన పోలీసులు, రాజకీయ నేతలపై కేసులు ఏమైయ్యాయి…? అతని అనుచరులు ఎక్కడున్నారు…? నయీం ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, భూపత్రాలు, వాహనాలు, పపేలుడు పదార్ధాలు, డైరీలు, గన్లు ఏమయ్యాయి…? ఇవన్నీ ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
సీబీఐ ఎంక్వైరీతో అయినా వాస్తవాలు బయటకు వస్తాయనుకుంటే.. అదీ జరగడం లేదు. ఎక్కడ CBI ఎంక్వైరీ వేస్తే బడా నేతల బండారం బయటపడుతుందన్న అనుమానమా…? నయీముద్దీన్ అలియాస్ నయీం భువనగిరి కేంద్రంగా నడిపిన దందాలు.. చూస్తే దడపుట్టిస్తాయా..? పోలీసులు, రాజకీయ నేతలను కూడా గడగడలాడించిన నయీం.. కొందరి అండదండలతోనే రెచ్చిపోయినట్టుగా అక్కడి ప్రజలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.
పీపుల్స్ వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావు వంటి వారి శిష్యరికంలో ఎదిగిన నయీం.. చివరకు నక్సలైట్లనే చంపేస్థితికి చేరుకున్నాడు. అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ సమాంతర సామ్రాజ్యాన్ని సాగించాడు. అతనికి ఎదురు తిరిగిన వారిని వదలలేదు.. తన కన్నుపడ్డ స్థిర,చర ఆస్తులను వదలలేదు. సిట్ దర్యాప్తు లోతుగా జరగనందువల్లే.. నయీంతో జతకలిసిన వారి పేర్లు బయటకు రాకుండా పోయాయని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి అంటున్నారు.
కొందరు యువకులతో గ్యాంగ్‌ను ఏర్పాటుచేసుకుని చేయని దందా లేదు. కబ్జాలు, భూదందాలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లు .. ఏదైనా అందులో నయీం ఉండేవాడు. పోలీస్ ఉన్నతాధికారి వ్యాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీం.. ఆ తర్వాత పోలీసుల అండతోనే మాఫియాగా ఎదిగాడని ప్రచారం. సెటిల్‌మెంట్ డాన్‌గా మారాడు. ఈ జాబితాలో పదుల సంఖ్యలో పోలీసు ఆఫీసర్లున్నా.. వారికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత అనేక అరాచకాలకు పాల్పడుతూ చెలరేగిపోతూ వస్తున్న నయీంను.. ఐదేళ్ల క్రితం పక్కా సమాచారంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత అతని బాధితులు న్యాయం కోసం ముందుకు వచ్చారు. అయినా ఇంత వరకు వారికి న్యాయం దక్కింది లేదు.. నయీంతో జతకలిసిన వారిని శిక్షించింది లేదు.
ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..
Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..