Fearing Covid-19: దేశంలో ఎక్కడ చూసినా కరోనా భయాందోళన నెలకొంది. చాలా మంది కరోనా భయంతో ఏవేవో పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తనకు కోవిడ్-19 సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి కిరోసిన్ తాగి మరణించాడు. కిరోసిన్ తాగితే వైరస్ తగ్గుతుందని కిరోసిన్ తాగి తనువుచాలించాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన మహేంద్ర (30) జ్వరంగా ఉండటంతో కరోనాగా భావించాడు. అనంతరం భయంతో కరోనాకు చికిత్సగా కిరోసిన్‌ను తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత మహేంద్రకు కరోనా పరీక్ష నిర్వహించగా.. రిపోర్టు నెగెటివ్‌గా వచ్చింది.
వృత్తిరీత్యా టైలర్ పనిచేసే మహేంద్ర భోపాల్ లోని శివనగర్ లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఐదారు రోజులుగా పలు రకాల మందులు వాడుతున్నా.. జ్వరం తగ్గకపోవడంతో కరోనా వచ్చిందని మహీంద్ర అనుమానించాడు. అయితే.. కిరోసిన్ కరోనావైరస్‌ను అరికడుతుందని.. ఔషధంగా పనిచేస్తుందని ఎవరో చెప్పగా బుధవారం రాత్రి కిరోసిన్ తాగాడు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేంద్ర మరణించాడని వైద్యులు వెల్లడించారు. ఎవరో చెప్పిన వాటిని అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: