Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కాగా మృతిచెందిన జవాన్‌ను హవల్దార్ కాశీరావ్ బనాలిగా గుర్తించారు. హంజిన్ గ్రామంలో రాజ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు వారిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి.
కాగా రెండు రోజుల క్రితం కాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్‌టీఈ)కు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ఉన్నాడు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపిన అబ్రార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విచారణ జరుపగా.. అబ్రార్ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఆయుధాలను రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరుపడంతో అబ్రార్ సైతం కాల్పుల్లో మృతి చెందాడు. అతనితోపాటు మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు.