Drugs Case: గుజరాత్‌లోని ముండ్రా పోర్ట్‌లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో ఏపీకి సంబంధాలున్నాయన్న కథనాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ విషయంలో అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని ఆయన గురువారం ఆయన కోరారు. వాస్తవాలను పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదని విపక్ష నేతలకు ఆయన సూచించారు. ఇటువంటి ఆరోపణతో ప్రజల్లో అనేక అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు బేరీజు వేసి మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచి పోవడం బాధాకరమన్నారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముండ్రా పోర్ట్ లో డిఆర్‌ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమీషనర్ ఇప్పటికే పత్రికా ప్రకటన విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని స్పష్టంచేశారని గుర్తుచేశారు. అయినా ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తాపించడం సరికాదన్నారు. వివిధ పత్రికలు, టీవీ చానళ్లు సైతం ఈ అంశంపై పలు కథనాలను ప్రచురిస్తూ, డిల్లీ, నోయిడా, చెన్నై, ముండ్రాలలో స్వాధీనాలు, అరెస్టుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాయని అన్నారు. నేరం యొక్క ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నాయని స్పష్టంచేశారు. అయితే సీనియర్ నాయకులు ఈ విషయంలో అపోహలు సృష్టించడం భావ్యం కాదన్నారు.
ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఆంధ్ర రాష్ట్రంలో లేవన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే డీఆర్ఐ అధికారులు మరియూ కేంద్ర సంస్థలు ధృవీకరించాయని తెలిపారు. హెరాయిన్ ను విజయవాడకి కానీ, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఎక్కడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్థాన్ నుండి ముండ్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడినట్లు మాత్రమే డీఆర్ ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొంటున్నారని తెలిపారు.
ఈ విషయంలో అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయన్న విషయాన్ని మనమందరం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని డీజీపీ సూచించారు.
Also Read..
Naga Chaitanya: ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య.. తనపై వస్తున్న రూమర్స్ గురించి ఏం చెప్పాడంటే..