భార్యకు విడాకులిచ్చాడు.. భరణం చెల్లించేందుకు చేయరాని పనిచేస్తూ పోలీసులకు చిక్కాడు!
నాగ్‌పూర్ లో విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించలేక ఒక నిరుద్యోగి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. కోర్టు ఆదేశించిన రూ. 6,000 నెలవారీ భరణం చెల్లించడానికి అతను నేరానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి, దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వివాహ బంధంలో ఇబ్బందులు ఉంటే.. సంసారం సాఫీగా సాగకపోతే చాలా మంది విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే అనేక విడాకుల కేసుల్లో భర్త, భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు అది పురుషులకు తలకుమించిన భారం అవుతోంది. తాజాగా తన భార్యకు విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమెకు భరణం చెల్లించేందుకు ఏకంగా దొంగగా మారాడు. ఈ వింత ఘటన నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. విడాకులు తీసుకున్న తన భార్యకు కోర్టు ఆదేశించిన జీవనోపాధి(భరణం) చెల్లించడానికి నాగ్‌పూర్‌లో ఒక నిరుద్యోగి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
మన్కాపూర్‌లోని గణపతినగర్ నివాసి కన్హయ్య నారాయణ్ బౌరాషిగా గుర్తించబడిన నిందితుడిని ఇటీవల జరిగిన ఒక దోపిడీ కేసు దర్యాప్తులో నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 22న మనీష్‌నగర్‌లో బైక్‌పై వచ్చిన దొంగ జయశ్రీ జయకుమార్ గడే అనే 74 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసును దోచుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ఈ సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత, బెల్టరోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. దర్యాప్తులో సాంకేతిక నిఘా, చిట్కాల ఆధారంగా పోలీసులు కన్హయ్య వద్దకు వెళ్లారు, తరువాత అతను నేరం అంగీకరించాడు.
తదుపరి విచారణలో అతను అలాంటి నాలుగు దొంగతనాలకు పాల్పడ్డాడని తేలింది. కోర్టు ఆదేశించిన ప్రకారం… తన మొదటి భార్యకు నెలకు రూ.6,000 మెయిటేనెన్స్ చెల్లించడానికి తాను చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు కన్హయ్య అంగీకరించాడు. రెండేళ్లుగా ఉద్యోగం లేకపోవడం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అతను తిరిగి వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో కన్హయ్య దొంగిలించన బంగారు గొలుసులలో కొన్నింటిని శ్రీ సాయి జ్యువెలర్స్ యజమాని అయిన అమర్‌దీప్ కృష్ణారావు నఖటే అనే స్థానిక నగల వ్యాపారికి విక్రయించాడని పోలీసులు తెలుసుకున్నారు. దొంగ సొమ్మును కొనుగోలు చేసినందుకు నఖటేను కూడా అరెస్టు చేశారు. కన్హయ్య చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా పోలీసులు ఒక మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్, రూ.1.85 లక్షల విలువైన 10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్హయ్య, నఖతే ఇద్దరూ ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. తదుపరి విచారణ కోసం బెల్టరోడి పోలీసులకు అప్పగించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




