Crime News: ఢిల్లీలో పోలీసులకు ఓ వింత అనుభవం ఎదురైంది. కర్ఫ్యూ సమయంలో మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగినందుకు ఓ 33 ఏళ్ల వ్యక్తి, భార్య, బంధువులతోకలిసి అనుచితంగా ప్రవర్తించాడు. ఏకంగా పిస్టల్ తీసి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న ఆదేశ్ అనే వ్యక్తి వృత్తిరీత్యా న్యాయవాది. పట్‌పర్‌గంజ్ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్న అతను శనివారం అర్థరాత్రి కర్ఫ్యూ సమయంలో తన భార్య, కజిన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
సీమాపురి గోల్చక్కర్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీసు వాహనాన్ని ఆపి, మాస్క్‌లు లేకుండా బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. దీంతో పోలీసులకు, వీరికి మధ్య తోపులాట జరిగింది. సంఘటనా స్థలానికి మరో పోలీసు చేరుకోవడంతో గొడవ ఇంకా పెరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న నిందితుడు తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో నేలపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అంతేకాదు మహిళలు కూడా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో కొన్ని మద్యం సీసాలు కూడా లభించాయని వివరించారు. దీంతో వారిపై ఇండియన్ పీనల్ కోడ్, ఆయుధాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.