బీహార్‌లో వ్యాపారిని దారుణంగా కాల్చి చంపిన దుండగులు.. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు
బీహార్ రాష్ట్రంలో వ్యాపారిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముజఫర్‌పూర్ జిల్లాలో వ్యాపారిని నలుగురు ఆగంతకులు కాల్చి చంపారు. ఈస్ట్ చంపారన్ జిల్లా...
బీహార్ రాష్ట్రంలో వ్యాపారిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ వ్యాపారిని నలుగురు ఆగంతకులు కాల్చి చంపారు. ఈస్ట్ చంపారన్ జిల్లా నాకా డెర్మా గ్రామానికి చెందిన యోగేంద్రకుమార్ ఇసుక క్రషర్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.యోగేంద్ర ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా నలుగురు గుర్తు తెలియని దుండగులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యోగేంద్రకుమార్‌ను అతనితో పాటు వచ్చిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం శ్రీకృష్ణ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యోగేంద్ర మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, నాలుగు తూటాలు లభించాయి. యోగేంద్రపై కాల్పులు జరిపిన నలుగురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్సై రాంనరేష్ సిన్హా తెలిపారు. యోగేంద్రను చంపేందుకు గల కారణాలు, వారితో ఏమైనా పాత కక్షలు ఉన్నాయా..?అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.