BTech Students: ప్రస్తుతం ప్రతీ చిన్న పనికి గూగుల్ తలుపు తడుతున్నారు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అయితే గూగుల్‌లో ఉండేదంతా సరైన సమాచారమేనా..? అంటే కచ్చితంగా అవుననే సమాధానం మాత్రం చెప్పలేము. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కొందరు బీటెక్ విద్యార్థులు ఇలాగే గూగుల్‌లో ఉద్యోగం కోసం వెతికి మోసపోయారు.
వివరాల్లోకి వెళితే.. కొందరు విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్‌లో ఉద్యోగాల కోసం వెతికారు. దీంతో వీరికి గూగుల్‌లో ఓ నెంబర్ దొరికింది. సదరు వ్యక్తి తాను సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ అని విద్యార్థులకు పరిచయం చేసుకున్నాడు. మాదాపూర్‌లో కొత్తగా లిమిటెక్స్ కంపెనీని ప్రారంభించాని తెలిపిన ఆ వ్యక్తి.. విద్యార్థులను రెజ్యూమ్‌లు పంపమని వారిని నమ్మించాడు. ఇలా ఆయనకు ఏకంగా 35 నుంచి 40 మంది రెజ్యూమ్‌లను పంపించారు. ఇక సదరు ప్రబుద్ధుడు తన యాక్షన్ ప్లాన్‌ను ప్రారంభించాడు. ఉద్యోగంలో చేరాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలని తెలిపాడు. దీంతో వెనకాముందు ఆలోచించని విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించారు. ఇలా మొత్తం రూ.27 లక్షలకుపైగా పంపించారు. అనంతరం ఫోన్ చేయడంతో సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వారిలో ఒకరైన అల్వాల్‌కు చెందిన బుచ్చి రాములు అనే వ్యక్తి సోమవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా తనలా ఎవరైనా.. మోసపోయారేమోనని ఆన్‌లైన్‌లో వెతికాడు. దీంతో దాదాపు 40 మంది తాము కూడా మోసపోయామని బుచ్చిబాబును కాంటాక్ట్ అయ్యారు. దీంతో వీరంతా కలిసి మంగళవారం.. నేరుగా సైబర్ క్రైం పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు.
Also Read: New Fraud: బెట్ ఇన్ ఎక్స్చేంజ్ పేరుతో నయా మోసాలు.. అలర్ట్‌గా ఉండాలంటూ పోలీసుల వార్నింగ్..