AP Crime News: ఆస్థి కోసం సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె హతం.. జైల్లో చిప్పకూడుతింటున్న ప్రియుడు

| Edited By: Anil kumar poka

Nov 30, 2021 | 5:23 PM

AP Crime News: తనతో సహజీవనం చేస్తున్న మహిళ ఆస్థి దక్కించుకోవాలని ఓ వ్యక్తి వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టింది... చివరకు జైల్లో చిప్పకూడా తినేలా చేసింది.

AP Crime News: ఆస్థి కోసం సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తె హతం.. జైల్లో చిప్పకూడుతింటున్న ప్రియుడు
AP Crime News
Follow us on

తనతో సహజీవనం చేస్తున్న మహిళ ఆస్థి దక్కించుకోవాలని ఓ వ్యక్తి వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టింది… చివరకు జైల్లో చిప్పకూడా తినేలా చేసింది. పెళ్ళయి పెళ్ళాం పిల్లలున్న శ్రీకాంత్‌ అనే వ్యక్తి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏఎన్‌ఎం మాధవి ఆస్థిపై కన్నేశాడు. 15 ఏళ్ల వయస్సున్న మాధవి కూతురు ప్రశాంతి బతికున్నంతకాలం తనకు ఆస్థి, మాధవి జీతం డబ్బులు దక్కవనుకున్నాడు. అందుకు పక్కా ప్లాన్‌ వేసి బాలిక ప్రశాంతి గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని కాల్చి బూడిద చేశాడు. ఆ ఆనవాళ్లు కూడా లేకుండా చేసేందుకు బూడిదను గొయ్యి తీసి పాతేశాడు… ఈ సంఘటనపై బాలిక బంధువులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీకాంత్‌ను అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రశాంతి బూడిదను పాతిపెట్టిన సమాధిని తవ్వి ఫోరెన్సిక్‌ వైద్యులతో పోస్టుమార్టమ్‌ నిర్వహించారు.

చదువుల సరస్వతి…
పదిహేనేళ్ళ బాలిక నక్కా ప్రశాంతి చదువుల సరస్వతి. ట్రిపుల్ ఐటీ లో మంచి ర్యాంక్ సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో చేరేందుకు సిద్దమవుతోంది. అయితే తన ఇంట్లో మృత్యువు కాచుకుకూర్చుందని ఆ అభాగ్యురాలు గ్రహించలేక పోయింది. భర్తతో విబేధించి ఒంటరిగా ఉంటున్న తన తల్లి మాధవి, ఆమెతో సహజీవనం చేస్తున్న పెళ్ళయి పెళ్ళాం పిల్లలులున్న శ్రీకాంత్‌ రూపంలో తనకు మృత్యువు ఎదురవుతుందని ఊహించలేకపోయింది. చివరకు తల్లి, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురై మట్టిలో కలిసిపోయింది. ప్రకాశంజిల్లా లింగసముద్రంలో జరిగిన ఈ దారుణ సంఘటన కలకలం రేపింది.

దారుణం వెనుక నేపథ్యం.. 

ప్రకాశంజిల్లా లింగసముంద్రం మండల కేంద్రంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న మాధవి ఒంటరిగా ఉంటోంది. పదేళ్ళ క్రితం భర్తతో విబేధించి తన కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రంలో ఉంటోంది. ప్రస్తుతం ప్రశాంతికి పదిహేనేళ్ళు. ఈ క్రమంలో వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రీకాంత్‌ అనే వ్యక్తితో మాధవి మూడేళ్ళ నుంచి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏఎన్‌ఎంగా పనిచేస్తూ తనకు వస్తున్న రూ.70 వేల జీతంలో కొంత శ్రీకాంత్‌కు ఇస్తోంది. అందులో కొంతభాగం తన కూతురు ప్రశాంతి చదువు కోసం ఖర్చు పెడుతోంది. అయితే మాధవి మొత్తం జీతం తనకే చెందాలని శ్రీకాంత్‌ మనస్సులో దుర్భుద్ది పుట్టింది. ప్రశాంతి లేకపోతే మాధవి జీతంతో పాటు ఆమె ఆస్థి కూడా తనకే సొంతం అవుతుందని ఆలోచించేవాడు. ఈక్రమంలో పెరిగి పెద్దదవుతున్న ప్రశాంతికి తన తల్లి చేసే పనులు నచ్చలేదు. తన తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్‌ మంచివాడుకాదని పలుమార్లు తల్లికి నచ్చజెప్పి చూసింది. దీంతో ప్రశాంతిపై ఆగ్రహం పెంచుకున్న శ్రీకాంత్‌.. బాలిక అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. అందుకు మాధవి సాయం కోరాడు. ప్రియుడి మోజులో ఉన్న మాధవి అందుకు అడ్డుచెప్పలేదు. ఈ దారుణంలో తాను పాలు పంచుకోకపోయినా.. ప్రియుడి పథకానికి అడ్డు చెప్పకుండా మిన్నకుండి పోయింది. దీంతో రెచ్చిపోయిన శ్రీకాంత్‌ తన స్నేహితుడు గురుబ్రహ్మం సాయంతో ప్రశాంతి గొంతునులిమి చంపేశాడు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్ళి పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. శవం ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేందుకు అక్కడే గొయ్యి తీసి కాలి బూడిదైన మృతదేహం భాగాలను పూడ్చి పెట్టేశాడు. ఏమీ ఎరగనట్టు ఇంటికి తిరిగి వచ్చాడు.

నిద్రలోనే చనిపోయిందని తొలుత బుకాయించిన నిందితులు…

త్రిపుల్‌ ఐటిలో సీటు సాధించి నూడివీడులో అడ్మిషన్‌ కోసం వెళ్ళాల్సిన ప్రశాంతి కనిపించకపోవడంతో బంధువులు ఆరా తీశారు. దీంతో ప్రశాంతి రాత్రి నిద్రలోనే చనిపోయిందని, ఇంటి ఓనరుకు తెలిస్తే తమను ఇంట్లో ఉండనివ్వడు కాబట్టి శవాన్ని తీసుకెళ్ళి దహనం చేశామని మాధవి, ఆమె ప్రియుడు శ్రీకాంత్‌ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం చెందిన బంధువులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మాధవి, ఆమె ప్రియుడు శ్రీకాంత్‌ మాత్రం బాలిక ప్రశాంతి నిద్రలోనే చనిపోయిందని బుకాయించారు.

ప్రశాంతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణ చేపట్టడంతో ట్విస్ట్ బయటపడింది. తనతో సహజీవనం చేస్తున్న మాధవి కూతురును ఆస్తికోసం శ్రీకాంత్ హత మార్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

విచారణలో నిజాలు వెలుగులోకి…

లింగసముద్రం మండల కేంద్రంలో బాలిక ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి కేసును పోలీసులు చేధించారు. పోలీసుల అదుపులో ఉన్న మాధవి ,శ్రీకాంత్ లను విచారణ నిమిత్తం పోలీసులు లింగసముద్రం తీసుకొనివచ్చారు. ప్రశాంతి ఇల్లు, శ్రీకాంత్ షాపులను పోలీసులు పరిశీలించి ప్రశాంతి ఎలా చనిపోయింది అనే దానిపై విచారించారు. కందుకూరు డిఎస్పీ శ్రీనివాసులు నేరస్థలాన్ని పరిశీలించారు. పామూరు పోలీస్ స్టేషన్లో మాధవి, శ్రీకాంత్ లను విచారించారు. పోలీస్ విచారణలో ప్రశాంతిని, ఆమె ఆస్థి కోసం శ్రీకాంత్ హత్య చేసినట్లు పోలిసుల వద్ద అంగీకరించాడు. ప్రశాంతిని కిరాతకంగా హత్య చేసి అనంతరం దహనం చేసి, ఎముకలను కూడా తీసి పాతి పెట్టినట్లు విచారణలో మాధవి, శ్రీకాంత్ లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. కేవలం మాధవి సంపాదన, ఆమె ఆస్థికి వారసురాలుగా ఉన్న ప్రశాంతిని అడ్డు తొలగించుకుంటే ఆమెతో సహజీవనం చేస్తున్న తనకు ఆస్తి పూర్తిగా దక్కుతుందని శ్రీకాంత్ వ్యూహం పన్నినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు…

ఈ హత్య చేసిన తరువాత జరిగిన పరిణామాల్లో భాగం పంచుకున్న శ్రీకాంత్ స్నేహితుడు గురుబ్రహ్మం, ప్రశాంతి తల్లి మాధవిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ తల్లి ధనమ్మ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. హత్య వెనుక ఉన్న కారణం ప్రశాంతి తన తల్లితో శ్రీకాంత్ సహజీవనాన్ని వ్యతిరేకించడం, ప్రశాంతి చదువుల కోసం దూరంగా వెళితే మాధవి తన డబ్బును ప్రశాంతికి ఇస్తుందని శ్రీకాంత్ ఆలోచించి నిద్రలో ఉన్న ప్రశాంతిని గొంతు నులిమి చంపినట్లు పోలిసుల విచారణలో శ్రీకాంత్ అంగీకరించాడని డిఎస్పీ తెలిపారు. ప్రశాంతి చనిపోయిన తరువాత విషయం తల్లి మాధవికి చెప్పి ఆమెను శ్రీకాంత్ దహన క్రియలు చేయడానికి ఒప్పించాడు. బయట వారికి చెబితే పోలీసుల ద్వారా ఇబ్బందులు ఉంటాయని మాధవిని భయపెట్టాడు. రాత్రి 10గంటల సమయంలో ప్రశాంతి మృతదేహాన్ని కారులో తీసుకొని వెళ్లి నిర్జన అటవీ ప్రాంతంలో కాల్చి వేశారు. మరుసటి రోజు ఉదయం ఆనవాళ్లు కనిపించకుండా మట్టితో కప్పి వేశారు. ఈ సంఘటనపై స్థానిక విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా బాలిక అనుమానాస్పద మరణం వెనుక నిజాలు వెలుగు చూశాయని కందుకూరు డిఎస్‌పి శ్రీనివాసరావు తెలిపారు.

బాలిక అవశేషాలకు ఫోరెన్సిక్‌ వైద్యుల పోస్టుమార్టం…

లింగసముద్రం మండల కేంద్రంలో తల్లి మాధవి, ఆమెతో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్ చేతిలో హత్యకు గురై అనంతరం దహనం చేయబడిన ప్రశాంతి మృతదేహానికి వైద్యుల బృందం శవపరీక్ష నిర్వహించారు. తల్లి మాధవి,ఆమె ప్రియుడు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ప్రశాంతి మృత దేహాన్ని పెట్రోల్,డీజిల్ పోసి మూడు సార్లు కాల్చివేశారు. పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించకుండా దహనం చేయగా మిగిలిన ఎముకలను పూడ్చి వేశారు. వైద్యుల బృందం ప్రశాంతిని పూడ్చి వేసిన ప్రదేశంలో త్రవ్వకాలు చేయగా కేవలం కొద్దిపాటి ఎముకలు మాత్రమే కనిపించాయి. మృతదేహాన్ని పూర్తి ఎముకలు కాలిపోయేంతవరకు కాల్చి వేసినట్లు పోలీసులు గుర్తించారు.

హత్యకు గురైన విద్యార్థిని నక్కా ప్రశాంతి మృతదేహానికి సంబంధించిన అవశేషాలను పంచనామా కోసం అధికారులు వెలికి తీశారు. తహసీల్దార్‌ సమక్షంలో రెవెన్యూ, పో లీస్‌, వైద్యాధికారులు ఈ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని కాల్చి బూడిద చేసిన గుంతలో నుంచి కొన్ని కాలిన వెంట్రుకలు, కాళ్ల భాగాలు, బూడిదను సేకరించారు. ఈ అవయవాలతో పాటు ఒక నల్లకోడి ఈక, మాంసం అవశేషాలనూ సేకరించారు. ఒంగోలులోని రిమ్స్‌ వైద్యులు రమేష్‌ ఆధ్వర్యంలో వీటిని సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు… ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా పూర్తి వివరాలు తెలుస్తాయని, మృతురాలి తల్లి మాధవి, ఆమె ప్రియుడు శ్రీకాంత్‌, మరో వ్యక్తి గురుబ్రహ్మంను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పామూరు సిఐ శ్రీనివాసులు తెలిపారు.

-ఫైరోజ్, టీవీ9 తెలుగు, ఒంగోలు

Also Read..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన నెటిజన్‌.. ‘ఎ‍ప్పుడు సచ్చిపోతమో తెలీదంటూ’ క్లాస్‌ పీకిన అఖిల్‌..

Antibiotics defects: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో పెను ప్రమాదం.. కరోనా కాలంలో మరింత డేంజర్‌.. హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు..