AP News: ఇటీవల కాలంలో చాలామంది ఏ సమస్య వచ్చినా దగ్గరలోని వాటర్ ట్యాంక్ ఎక్కేస్తున్నారు. భార్య కాపురానికి రాకున్నా.. పరీక్షలో ఫెయిల్ అయినా, ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకపోయినా దగ్గరలోని వాటర్ ట్యాంక్ ఎక్కేస్తున్నారు. తాజాగా ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి హంగామా సృష్టించింది. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసింది. ఈ ఘటన పాలకొల్లులోని బెత్లహంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పాలకొల్లు బెత్లహంపేటకు చెందిన పెట్టెల కేశవాణి, తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల కిందట యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అందుకు భాస్కర్ నిరాకరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో బెత్లహంపేటలోని వాటర్‌ట్యాంకు పైకి ఎక్కి ఆందోళనకు దిగింది. ప్రియుడితో పెళ్లి చేస్తేనే దిగి వస్తానని, లేకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు వాట్సప్ వీడియో పంపింది.
ఇంతలో ఈ విషయం పోలీసులకు చేరడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి తల్లిదండ్రులకు కబురు పంపారు. యువతికి ఫోన్ చేసి మాట్లాడారు. భాస్కర్‌ను కూడా తీసుకొచ్చి పెళ్లికి ఒప్పించారు. అనంతరం ఆమె కిందకు దిగింది. ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేసి, సమీపంలోని ఆలయంలో వివాహం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని హెచ్చరించారు.