Telugu Akademi Funds Scam: తెలుగు అకాడమి స్కాం దర్యాప్తులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు అకాడమి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి పీఏను అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. ఈ పరిణామంతో మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి చుట్టూ కుంభకోణం ఉచ్చు బిగుస్తున్నట్టు అర్థమవుతోంది. ఇక, మొత్తంగా తెలుగు అకాడమి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని తలోకొంత పంచుకున్నారని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సాయికుమార్ రూ.20 కోట్లు, ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. నిందితుడు సాయికుమార్ తన వాటా కింద తీసుకున్న సొమ్ముతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 35 ఎకరాల భూమి కొనుగోలు చేశాడని కూడా పోలీసులు తేల్చారు.
అటు, యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన పాత్ర కూడా ప్రముఖంగానే ఉన్నట్టు ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నిగ్గు తేల్చారు. ఇక మరో నిందితుడు డాక్టర్ వెంకట్ తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని చెప్పినట్టు తెలిసింది. ఇక, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు, ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించడం మరో ఆసక్తికర పరిణామం.
Read also: TIDCO houses: ఒక్క రూపాయికే ఏపీలో టిడ్కో ఇళ్లు.. ఇవాళ వెయ్యి మంది లబ్ధిదారులకు అందజేత