Road Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కు బోల్తా పడి 8 మంది కూలీల దుర్మరణం.. మరి కొంతమందికి..
జాతీయ రహదారిపై బోరు పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు సోమవారం ఉదయం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 8మంది అక్కడికక్కడే మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Bihar Road Accident: బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ బోల్తా పడిన ఘటనలో 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బీహార్ జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్జియా వద్ద జాతీయ రహదారి 57పై జరిగింది. జాతీయ రహదారిపై బోరు పైపుల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు సోమవారం ఉదయం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 8మంది అక్కడికక్కడే మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో ట్రక్కులో మొత్తం 16 మంది ఉన్నారు. క్యాబిన్లో కొందరు ఉండగా.. పైపైలపై మరికొంతమంది ఉన్నారని పోలీసులు తెలిపారు.
స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతులు రాజస్థాన్‌లోని ఉదయపూర్ ఖైర్వారాకు చెందిన వారని పేర్కొంటున్నారు. ట్రక్కు అగర్తల నుంచి జమ్మూకశ్మీర్‌కు వెళ్తోందని సమాచారం. వీరంతా దినసరి కూలీలని.. మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..