Khammam Road Accident: దేవి నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాల్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అయ్యగారిపల్లి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ముదిగొండ పోలీసులు వెల్లడించారు.
మండలంలోని కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నది వద్దకు బయలు దేరారు. ఈ క్రమంలో ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉండగా.. మరో ట్రాక్టర్‌లో కొంతమంది గ్రామస్థులు, యువకులు ప్రయాణిస్తున్నారు. అయితే.. విగ్రహం ఉన్న ట్రాక్టర్ మున్నేరు నది వద్దకు వెళ్లింది. వెనుకవైపు ఉన్న మరో ట్రాక్టర్ వల్లభి వైపు వెళ్లింది.
వర్షం కురుస్తుండటంతో ట్రాక్టర్ అయ్యగారిపల్లి వద్ద ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. పలువురికి తీవ్రగాయాలు కాగా.. వారందరినీ.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో కమలాపురం గ్రామానికి చెందిన ఆవాసాన్ని ఉపేంద్ర(35) ములకలపల్లి ఉమ(27 ) చోడబోయిన నాగరాజు(27) బిచ్చలా వెలగొండ స్వామి(54) మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: