Bengal Road Accident: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిఉన్న ట్రక్కును ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 17మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మందికిపైగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచు, వ్యాన్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.
ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో సహా మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో 10 మంది పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. నార్త్ 24 పరగణాస్‌లోని బాగ్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్మదన్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు శ్రబానీ ముహురి మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందకు కుటుంబంలోని 40 మంది వ్యక్తులు పలు వాహనాల్లో బయలు దేరారు. మటాడోర్‌లోని నవద్వీప్ శ్మశానవాటికకు వెళ్తున్న క్రమంలో వ్యాన్.. ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులకు కృష్ణానగర్ ఆస్పత్రిలో చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు. అయితే.. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: