Maharashtra boy addicted to mobile chat app: ఓ బాలుడు సోషల్ మెసేజింగ్ మొబైల్ ఫోన్ యాప్‌కు బానిసయ్యాడు. రోజూ ఫోన్లో గంటల తరబడి చాటింగ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. మహారాష్ట్రలో మాయమై.. గోవాలో ప్రత్యేక్షమయ్యాడు. అసలేందుకు బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడో తెలుసుకొని పోలీసులే ఆశ్చర్యపోయారు. మెసేజింగ్ మొబైల్ ఫోన్ యాప్‌కు బానిసై ఇంట్లో నుంచి పారిపోయిన పదమూడేళ్ల బాలుడికి సంబంధించిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లో చోటుచేసుకుంది. బాద్లాపూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు అక్టోబర్ 31న ఇంటినుంచి బయలు దేరి వెళ్లి.. గోవాలో ప్రత్యేక్షమయ్యాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన బాలుడిని సురక్షితంగా పట్టుకొని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.
తాను ఒక సంవత్సరంపాటు రానని.. ఇంటికి దూరంగా ఉంటానని తల్లిదండ్రులకు చెప్పి ఆ బాలుడు ఇంటినుంచి బయలు దేరాడని పోలీసులు తెలిపారు. అప్పుడు తల్లిదండ్రులు బాలుడి మాటలను పట్టించుకోలేదు. ఆ తర్వాత నిజంగానే ఇంటినుంచి వెళ్లడంతో బద్లాపూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సందేశ్ మోర్ తెలిపారు. ఆ తర్వాత పోలీసులు.. అతని స్నేహితులను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు డిస్కార్డ్ మొబైల్ యాప్‌లో ఇతర పిల్లలతో కనెక్ట్ అయ్యాడని.. ప్రతిరోజూ గంటల తరబడి గ్రూప్‌లో చాట్ చేసేవాడని వారు తెలిపారు. అయితే.. చాట్ గ్రూప్ సభ్యులు తమను తాము నిరూపించుకోవడానికి.. జీవితంలో ఏదైనా చేయాలని తమ ఇళ్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని.. వారి మాటలను నమ్మి ఇంటినుంచి వెళ్లిపోయాడని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు.
అనంతరం థానే సైబర్ సెల్.. బాలుడి మొబైల్ ఫోన్ ఐపి అడ్రస్‌ను ట్రేస్ చేసి.. చాట్‌లను కనుగొన్నారు. అతను గోవాలో ఉన్నట్లు నిర్ధారించుకొని అక్కడికి చేరుకున్నారు. బాలుడిని గోవాలోని కలంగుటే వద్ద గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను కొల్హాపూర్ మీదుగా గోవాకు చేరుకున్నాడని.. పోలీసు అధికారి తెలిపారు. ఆ తర్వాత బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: