Spurious Liquor: విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి.. 8 మందికి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Spurious Liquor: మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది బలయ్యారు. మరో 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు ...
Spurious Liquor: మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది బలయ్యారు. మరో 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ అనురాగ్ సుజానియా తెలిపిన వివరాల ప్రకారం.. పలు గ్రామాలకు చెందిన కొందరు తెల్లరంగులో ఉన్న మద్యాన్ని తెచ్చుకుని సేవించారని, వీరిలో మాన్‌పూర్, పహవలి గ్రామాలకు చెందిన 11 మంది మృతి చెందగా, మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం గ్వాలియర్‌కు తరలించినట్లు చెప్పారు.
అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మద్యం విషపూరితమైనదో, కాదో తేలుతుందన్నారు. అలాగే ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని పంపినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కాగా, గత ఏడాది అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం కారణంగా 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ మద్యం లభ్యమవుతున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.