Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాతే దాని ప్రభావం మొదలవుతుంది: కేంద్ర ఆరోగ్యశాఖ
Corona Vaccine: గత ఏడాది నుంచి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఇక అంతం అయ్యే సమయం అసన్నమైంది. వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 16వ తేదీ..

Corona Vaccine: గత ఏడాది నుంచి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఇక అంతం అయ్యే సమయం అసన్నమైంది. వైరస్ విరుగుడుకు వ్యాక్సిన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతున్న తరుణంలో వ్యాక్సిన్ పనితీరు గురించి కేంద్ర ఆరోగ్యశాఖ పలు వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమేనని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే దాని ప్రభావం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఇవ్వనున్న కరోన వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాతే దాని ప్రభావం కనిపిస్తుందని రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల వరకూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే వేల మందిపై ప్రయోగాలు జరపగా, ఇవి సురక్షితమని తేలిందని నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు.
అయితే వీటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు సర్వసాధారణమేనని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈనెల 16 నుంచి టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిదశలో మూడుకోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరిలో దాదాపు కోటి మంది ఆరోగ్య సిబ్బంది, మరో రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏది ఏమైనా ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యాయి. అతి వేగంగా పరిశోధనలు జరిపి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేశారు. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అలాగే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ప్రజలు మాత్రం జాగత్తలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: