టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత..పోలీసుల‌పై రాళ్లు రువ్విన వలస కూలీలు

టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత..పోలీసుల‌పై రాళ్లు రువ్విన వలస కూలీలు

కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్ద సుమారుగా 300 మంది, కొవ్వూరు టోల్‌గేట్‌ వద్ద వందమంది వలస కార్మికులు రోడ్లపైకి....

Jyothi Gadda

|

May 04, 2020 | 3:20 PM

లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త 45 రోజులుగా ఇబ్బందులు ప‌డ్డ వ‌ల‌స‌కూలీలు రెచ్చిపోయారు. త‌మ‌ను వెంట‌నే స్వ‌స్థ‌లాల‌కు పంపించాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని కూలీలు పోలీసుల‌పై రాళ్ల‌తో దాడిచేసిన సంఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చోటు చేసుకుంది.
ప‌శ్చిమ‌గోదావ‌రి  జిల్లా కొవ్వూరు మండలం నందు ఇసుక ర్యాంపుల్లో పనిచేసే బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను స్వ‌రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కొవ్వూరు గోదావరి మాత విగ్రహం వద్ద సుమారుగా 300 మంది, కొవ్వూరు టోల్‌గేట్‌ వద్ద వందమంది వలస కార్మికులు రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వలస కార్మికులు అయిన మమ్మల్ని వెంటనే మీరు చెప్పినట్లుగా ఈరోజు మా స్వస్థలాలకు పంపించాలని పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు. నిన్న రాత్రి నుండి ఆర్.డి.ఓ, డిఎస్పి ఎంత సముదాయించి నప్పటికీ వలస కార్మికులు రాజీపడలేదు. ఒక సందర్భంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో కొవ్వూరు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులను, సిబ్బందిని కొవ్వూరు తరలించడం జరిగింది.
ఈ సందర్భంలో కొవ్వు టోల్‌గేట్‌ వద్ద పోలీసులకు, వలస కార్మికులకు మ‌ధ్య వాగ్వాదం జరిగింది. ప‌రిస్థితి చేజారిపోవ‌టంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వలస కార్మికులు పోలీసులపై గాజు సీసాలు రాళ్లతో దాడికి చేశారు. జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో తణుకు సీఐ కృష్ణ చైతన్యకు స్వల్ప గాయాలు కావడంతో రాజమండ్రి ఆసుపత్రికి త‌ర‌లించారు. విషయం తెలుసుకున్న డి.ఎస్.పి కే .రాజేశ్వర్ రెడ్డి, ట్రైనీ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప‌రిస్థితి స‌మీక్షించి కూలీల‌కు న‌చ్చ‌జెప్పారు. ప్రత్యేక ట్రైన్‌లో మూడు రోజుల్లో వారివారి ప్రదేశాలకి పంపుతామని హామీ ఇవ్వడంతో వలస కార్మికులు నెమ్మ‌దించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu