లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు సన్నద్దంకండిః డబ్ల్యూహెచ్ వో
తాజాగా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ సడలింపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో పలు సూచనలు చేసింది.

ప్రపంచదేశాలు కరోనా బారినపడి కొట్టుమిట్టాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువు వైరస్‌తో లాక్‌డౌన్ వార్ కొనసాగిస్తున్నాయి. గత మూడు వారాలుగా విశ్వవ్యాప్తంగా వందల దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. వైరస్ నివారణకు ఇంతవరకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో సామాజిక దూరం ఒక్కటే మార్గంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. తాజాగా కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ సడలింపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో పలు సూచనలు చేసింది.
కరోనా నేపథ్యంలో మూడు వారాలుగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. దీంతో కేసులు తక్కువగా నమోదైన దేశాల్లో లాక్ డౌన్ సడలించడానికి ఆలోచించమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) సూచించింది. ఒకేసారి కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా లాక్ డౌన్ తొలగించాలని డబ్ల్యుహెచ్‌వో టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ కోరారు. ‘పరిస్థితిని అంచనా వేసుకుంటూ లాక్ డౌన్ ఆంక్షలను సడలించినట్లయితే… ప్రజలు మునుపటిలా తమ తమ పనుల్లోకి వెళ్లగలుగుతారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి తేరుకుంటుంది’ అన్నారు. లాక్ డౌన్ తొలగించినప్పటికీ జనం కొంతకాలం పాటు సామాజిక దూరం తప్పక పాటించాలని సూచించారు.
ఇక లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేయాలో నిర్ణయించడానికి ఆయా దేశాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆరు ప్రమాణాలను నిర్దేశించింది.
* కరోనా వైరస్ సంక్రమణ పూర్తిగా నియంత్రణలోకి వస్తేనే లాక్‌డౌన్ ఎత్తివేత
* వైరస్ బారిన పడ్డ రోగులను త్వరితగతిన గుర్తించడం, చికిత్స, క్వారంటైన్ సామర్థ్యం పెంపొందించుకోవాలి
* ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్‌లలో కరోనా నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం
* స్కూల్స్, కాలేజీలు,ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో కరోనా పట్ల పూర్తి అవగాహన, నివారణ చర్యలు
* జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఎప్పటికప్పుడు ఆరోగ్య పర్యవేక్షణ తప్పని సరి
* ఆయా దేశాల్లో కరోనా మరణాల రేటు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.