నియంత్రిత పంటల విధానంపై కేసీఆర్ వివరణ..వాటికి మాత్రమే రైతు భరోసా

రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నియంత్రిత పంటల విధానంపై కేసీఆర్ వివరణ..వాటికి మాత్రమే రైతు భరోసా
Follow us

|

Updated on: May 18, 2020 | 5:03 PM

నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ పంట..ఎంత విస్థిర్ణంలో..ఎప్పుడు వేస్తే..లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే నియంత్రిత పంటల విధానం అని వివరించారు. ఇందులో భాగంగా మన శాస్త్రజ్ఞులు మంచి దిగుబడి వచ్చే..మంచి రాబడి వచ్చే పంటలను సూచిస్తారు వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ 4 నేపథ్యంలో తెలంగాణలో సడలింపులు, కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

‘‘రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంట సాగు చేస్తారని… అలా చేస్తే పంటకు మంచి ధర రాదని’ మరోమారు స్పష్టం చేశారు. మార్కెట్ డిమాండును బట్టి పంట పండించాలన్నారు. మనం గత ఏడాది 79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పూర్తిగా వరి పంట వేస్తే.. నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని చెప్పారు. అంత పెద్ద మొత్తంలో వరి వస్తే.. తట్టుకునే శక్తి.. బియ్యం తయారు చేయగల సామర్థ్యం మన దగ్గర ఉన్న రైస్ మిల్లర్లకు లేదన్నారు. మన మిల్లర్లు కోటి 75 లక్షల టన్నుల వరి మాత్రమే మిల్లింగ్ చేస్తారని చెప్పారు. కనుక పంటలు వేసే ముందు లాభసాటి అనే అంశాన్ని తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం కరోనా వల్ల వరి ధాన్యాన్ని కొన్నామని, కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలమని రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.

ఇక, రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారని చెప్పారు. వారంతా రైతులకు అందుబాటులో ఉండి సాగులో విధి విధానాలు వివరిస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుందన్నారు. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు.. గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశాం.. ఈ సారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలని సూచించారు. 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చు.. ఇందులో దొడ్డు రకాలు.. సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు. 2 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేద్దాం.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.

ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాలంటే యాసంగి లో మొక్కజొన్న వేయండి. ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి.. కూరగాయలు.. సోయా.. పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయండి. ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారి వద్ద ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.