తెలంగాణలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటలనుంచి తిరిగి తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కాగా…..కరోనా పూర్తిగా అదుపులోకిరాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. గత కేబినెట్ సమావేశం చేసిన ఆదేశాలమేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్ డౌన్ ను ప్రస్థుతం కొనసాగిస్తున్న సమయాన్ని అనుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు పైన తెలిపిన 7 నియోజకవర్గాల్లో లాక్ డౌన్ యధాతధ స్థితినే ( ఉదయం 6 గంటలనుంచి 1 గంట వరకు సడలింపు….మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,33,134 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో సోమవారం కరోనాతో 15 మంది మరణించారు. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 3,409కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి.
Also Read: ప్రాణం పోసిన అమ్మే అత్యంత దారుణంగా కొట్టి ఊపిరి తీసింది.. పరాయి వ్యక్తి మోజులో పడి