Corona Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుంది.. కానీ.. గణంకాల్లో ఆసక్తికర విషయాల వెల్లడి..
Corona Vaccine: కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు. సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోన్న ఈ రాకాసి వందల సంఖ్యలో జనాలను పొట్టన పెట్టుకుంటోంది. ఇదిలా...
Corona Vaccine: కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడంలేదు. సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభిస్తోన్న ఈ రాకాసి వందల సంఖ్యలో జనాలను పొట్టన పెట్టుకుంటోంది. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతుండడంతో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా వెల్లడైన గణంకాల ప్రకారం కోవాక్జిన్ సెకండ్ డోస్ తీసుకున్న వారిలో కేవలం 0.04 శాతం మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక కోవిషీల్డ్ తీసుకున్న వారి విషయానికొస్తే ఇది కేవలం 0.03 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) అందించిన డేటా ఆధారంగా పరిశోధకులు ఈ వివరాలను వెల్లడించారు. ఈ విషయమై ఐసీఎమ్ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బాలరామ్ భార్గవ మాట్లాడుతూ.. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న పదివేల మందిలో కేవలం 2 – 4గురు మాత్రమే కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య చాలా తక్కువని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో కూడా పెద్దగా ఆందోళ చెందాల్సిన స్థాయిలో వైరస్ ప్రభావం ఉండడంలేదని వివరించారు. ఇదిలా ఉంటే కోవిషీల్డ్, కోవాక్జిన్ వ్యాక్సిన్ల రెండు డోస్‌లు తీసుకున్న 10 నుంచి 15 రోజుల తర్వాతే శరీరానికి సరిపడ యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కోవాగ్జిన్‌ను దేశంలో సుమారు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. వీరిలో 93 లక్షల మంది మొదటి డోస్ తీసుకోగా.. 17 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. మొదటి డోస్ తీసుకున్న 93 లక్షల మందిలో 4,208 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక సెకండ్ డోస్ తీసుకున్న 17 లక్షల మందిలో 695 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక కోవిషీల్డ్ విషయానికొస్తే.. ఈ వ్యాక్సిన్ మొదటి డోస్‌ను 10 కోట్ల మంది తీసుకోగా.. వీరిలో 17,415 మందికి కరోనా సోకింది. అలాగే సెకండ్ డోస్‌ను 1.5 కోట్ల మంది తీసుకోగా వీరిలో 5,104 మంది వైరస్ బారిన పడ్డారు. అందులోనూ కరోనా బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా ఎక్కువగా సోకుతున్నట్లు లెక్కల్లో తేలింది. ఈ లెక్కన వ్యాక్సిన్ అనేది చాలా వరకు వైరస్‌ను కట్టడి చేయడంలో విజయవంతమవుతుందని తేలింది.
Also Read: Sensex: కరోనా ఉగ్రరూపంతో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు