కరోనా పాటిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. గతవారం ఇది 4.7గా ఉంటే ఇప్పుడు 5.5కి చేరింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్.. 8 రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలతోపాటు. రాజస్థాన్, కేరళ, కర్నాటక, హర్యానా, ఢిల్లీల్లో కేసులు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లోని 63 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10కిపైగా ఉందన్నారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అవసరమైన వైద్య సన్నద్ధతతో ఉండాలని లేఖలో సూచించారు. కేసులు పెరుగుతున్న దశలోనే టెస్టులు పెంచడం ద్వారా నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
అలాగే మహమ్మారి వ్యాప్తి అరికట్టేందుకు ఐదు అంచెల విధానం అనుసరించాలన్నారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్, వ్యాక్సినేషన్‌తోపాటు కోవిడ్ ప్రోటోకాల్ పాటించడం ముఖ్యమన్నారు. జీనోమ్ సీక్వెన్వింగ్ కోసం ఎక్కువ శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 66 వేలకు పైగా ఉన్నాయి. శుక్రవారం 29 మంది మరణించారు. కేరళలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడు నెలల్లో ఈ స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకూ మొత్తం 5 లక్షల 31 వేల 200 మందికిపైగా చనిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..