India Over 22 crore COVID-19 vaccine doses: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. అయితే.. తాజాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో ఘనతను సాధించింది. జూన్ 2 సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 22 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రకటనను విడుదల చేసింది.
కాగా.. దేశంలో జనవరి 16 న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటగా.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ అందించారు. ఆ తర్వాత వృద్ధులకు, పలు వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు దాటిన వారి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. కాగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి రాష్ట్రాలకు పలు సూచనలు సైతం చేసింది. ఇప్పటికే ఉత్పత్తిని పెంచాలని పలు ఫార్మసీ సంస్థలను సైతం ఆదేశించింది.
ఇదిలాఉంటే.. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832కు పెరగగా.. మొత్తం 3,35,102 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,93,645 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: