Catholic priest – 22 arrested for violating COVID-19 protocol: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ చర్చి ఫాదర్ సహా 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎర్నాకుళం జిల్లాలోని పూవతుస్సేరీ గ్రామంలో చర్చి ఫాదర్ ముగ్గురు చిన్నారులకు దివ్య సప్రసాద స్వీకరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని.. చర్చి ఫాదర్ జార్జ్ పాలమాట్టంతో పాటు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు, బంధువులు సహా మొత్తం 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటువ్యాధుల నివారణ చట్టంలోని పలు సెక్షన్ల కింద వీరందరికీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా అరెస్ట్ చేసిన కొద్ది సేపటి వారందరినీ బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. ఈ కార్యక్రమం కోసం పిల్లల తల్లిదండ్రులు విదేశాల నుంచి వచ్చారనీ.. తమ సెలవులు ముగుస్తుండడంతో తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారని.. దీంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చర్చి నిర్వాహకులు పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఈ కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడిందని.. దీంతో సోమవారం నిర్వహించినట్టు తెలిపారు. రోమన్ కేథలిక్ ప్రజలు తమ జీవితంలో దివ్య సప్రసాద స్వీకరణ కార్యక్రమాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకించి కేరళలో పిల్లలకు తొలిసారి దివ్య సప్రసాదం ఇస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఇదిలాఉంటే.. కరోనా కట్టడి కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తున్నట్టు శనివారం కేరళ ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read: