Coronavirus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..?

|

Feb 26, 2021 | 10:37 AM

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటం..

Coronavirus: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎంత మంది చనిపోయారంటే..?
Follow us on

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని.. ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఆతరువాత వరుసగా.. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ క్రమంలో గత 24గంటల్లో గురువారం.. దేశవ్యాప్తంగా 16,577 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో (India Coronavirus) మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,63,491 (1.10కోట్లు) కు చేరిందని ప్రకటించింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 120 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,825కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. డిశ్చార్జ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్న కరోనా నుంచి 12,179 మంది బాధితులు మాత్రమే కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,50,680 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ (Union Health Ministry) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,55,986 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే దేశంలో మళ్లీ యాక్టివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం దేశంలో కరోనా (Coronavirus) రికవరీ రేటు 97.17 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8,31,807 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 25వ తేదీ వరకు మొత్తం 21,46,61,465 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Covid-19 vaccination) పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,34,72,643 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ప్రయాణికులు తమ రాష్ట్రాల్లోకి రావాలంటే.. ముందస్తుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశాయి.

Also Read:

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా.. ఏ ఏ రోజు ఏ ప్రసాదాలను సమర్పిస్తారంటే..

Covid-19: వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

కన్నుల ముందు కదలాడుతున్న శివుడు.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 24 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే..