AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా.. ఏ ఏ రోజు ఏ ప్రసాదాలను సమర్పిస్తారంటే..

కలియుగ వైకుంఠంగా పేరుపొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ శ్రీవెంకటేశ్వరుడు స్యయంగా వెలిశాడని ప్రతీతి. పూర్వం తిరుమలగిరిపై

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా.. ఏ ఏ రోజు ఏ ప్రసాదాలను సమర్పిస్తారంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2021 | 10:26 AM

Share

కలియుగ వైకుంఠంగా పేరుపొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ శ్రీవెంకటేశ్వరుడు స్యయంగా వెలిశాడని ప్రతీతి. పూర్వం తిరుమలగిరిపై పవిత్రాద్బుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని అనేక రకాల పేర్లతో సంబోదిస్తుంటారు. ఆనంతనియుడైన శ్రీవారు స్వయంభుగా వెలసిన బంగారు మందిరాన్ని ఆనంద నియమని పిలుస్తుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సినది తిరుమలేశుడు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తనల ప్రియుడు, నైవేద్య ప్రియుడు. సంగీతాన్ని, సంకీర్తనలతోపాటు ఉత్సవాలను, ఉరేంగింపులను కూడా శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ గురించి మనందరికి తెలిసిన విషయమే.

కేవలం లడ్డూ మాత్రమే కాకుండా శ్రీవారికి మరిన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఇందుకు ఎంతోమంది రాజులు వితరణలు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ప్రసాద వితరణ కోసం ఏయే రాజు ఎంతెంత స్వామి వారికి సమర్పించిందీ ఆలయ గోడలపై శాసనాలుగా రూపొందించారు. స్వామివారికి నివేదించే ప్రసాదాలకు చరిత్ర ఎంతో ఘనమైంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా శ్రీవారికి నైవేద్య వితరణ ఎంతో నిష్టగా ఒక క్రమ పద్ధతిలో సాగిస్తున్నారు ఆలయ నిర్వకులు. స్వామివారికి రోజూ త్రికాల నైవేద్యం ఉంటుంది. ఈ నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంట అని పిలుస్తుంటారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారల్లో తప్ప మిగిలిన అన్ని రోజులలో శ్రీవారికి సమర్పించే నైవేద్య సమయాల్లో మార్పులు ఉండవు. గురు, శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు స్వామి వారిక తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండో గంట ఉదయం 10 గంటలకు.. మూడో గంట రాత్రి 7.30 నిమిషాలకు ఉంటుంది. ఇక గురు, శుక్రవారాల్లో రెండో గంట ఉదయం 7.30 నిమిషాలకు ఉంటుంది. స్వామివారికి సమర్పించే వాటిలో రోజూ ఒకే రకమైన ప్రసాదాలు ఉన్నా, ప్రతి నివేదనలోనూ వైవిధ్య ఉండేలా చూస్తారు. ఉదయం 5.30 నిమిషాలకు మొదటి గంట ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఇక ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయస్వామివారితోపాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే రెండో గంటలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7.30 నిమిషాలకు మూడవ గంటలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఈరోజులు ఇలా ఉండగా.. ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ది చెందిన ఆదివారం పిండిని స్వామివారికి సమర్పిస్తారు.

తిరుమల శ్రీవారికి నివేదించే వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సోమవారం విశేష పూజ సందర్బంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను స్వామివారికి నివేదిస్తారు. ఇక మంగళవారం ప్రత్యేకంగా మాత్ర ప్రసాదాన్ని నివేదిస్తారు. ఈ మాత్ర ప్రసాదంతోపాటు రోజూ సమర్పించే ప్రసాదాలు కూడా ఉంటాయి. బుధవారం ప్రత్యేకంగా పాయసం, పెసరప్పును నివేదిస్తారు. ఇక గురువారం రోజూ సమర్పించే ప్రసాదాలతోపాటు తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబి, మురుకు, పాయసాలను నివేదిస్తారు. ఇక శ్రీవారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం ప్రత్యేకంగా పోళీలను సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదికలో కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్యోజనం, మిర్యాలపొంగలి, లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్, కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదిస్తారు.

Also Read:

మాఘ పూర్ణిమ 2021: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? ఆరోజున ఏవిధంగా భగవంతుడిని ఆరాధించాలంటే..