కరోనా బాధితుల్ని పట్టేస్తున్న స్మార్ట్ హెల్మెట్..
మందులేని మహమ్మారి కరోనాని అడ్డుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్‌లు అందుబాటులోకి వచ్చాయి.
కోవిడ్-19 భూతం ప్రపంచదేశాలను పట్టిపీడిస్తోంది. సుమారుగా 210 దేశాల వరకు వైరస్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కరోనా ధాటికి లక్షల సంఖ్యలో బాధితులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మందులేని మహమ్మారిని గుర్తించటం కూడా కష్టంగా మారటంతో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ఈ వైరస్ ని అడ్డుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితుల గుర్తింపు ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్‌లు అందుబాటులోకి వచ్చాయి.
ఎడారి దేశం దుబాయ్‌లోనూ వైరస్ పంజా విసురుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం స్మార్ట్ ఆలోచన చేసింది. దుబాయ్‌లో వైరస్ గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్ లను వినియోగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెల్మెట్లను అక్కడి పోలీసులకు, రవాణా శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో పరారుణ కాంతి కెమెరా, కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతిక పరికరాలను అమర్చారు. దీనివల్ల వీటిని పెట్టుకున్న ఉద్యోగి ముందు నుంచి వెళ్లే పాదచారులు, వాహనదారులను హెల్మెట్‌లోని థర్మల్ స్క్రీనింగ్ పరికరం స్కాన్ చేస్తుంది. వారి శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలను వారికి తెలియకుండానే గుర్తిస్తుంది. ఆ విధంగా బాధితులెవరైనా తమ ముందు నుంచి వెళ్లినట్టయితే తక్షణం వారిని పట్టుకుని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనివల్ల బాధితుల నుంచి వారికి తెలియకుండానే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరగకుండా కట్టడి చేయటం తేలికగా మారుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో స్మార్ట్ హెల్మెట్ల వినియోగాన్నిఅవలంభిస్తోంది.