Delhi Covid-19 cases: దేశ రాజధాని ఢిల్లీని కరోనా సెకండ్ వేవ్ ఇటీవల గడగడలాడించిన విషయం తెలిసిందే. నిత్యం వేలాది కరోనా కేసులు, వందలాది కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే.. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో కేసుల సంఖ్య 100కు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాజధానిలో 57,128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 89 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా దిగివస్తోంది. ప్రస్తుతం 0.16 శాతానికి పడిపోయింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో ఇదే అత్యల్పం.
ఇదిలాఉంటే.. ఢిల్లీలో యాక్టివ్ కేసులు కూడా 2000 దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 1996 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీలో 14,32,381 మందికి కొవిడ్ సోకగా.. అందులో 14,05,460 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 11 మంది మరణించారు. వీరితో కలిపి మొత్తం 24,925 మంది ప్రాణాలు కోల్పోయారు. అయతే.. కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వస్తున్నప్పటికీ.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
కష్టకాలంలో వైద్యులకు సహాయపడేందుకు, వైద్య సేవలను వేగంగా విస్తరించేందుకు వీలుగా 5వేల మంది యువకులకు హెల్త్ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: