కరోనా సోకిందనే భయంతో వృద్ధ జంట ఆత్మహత్య
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజల్లో భయాందోళన రేపుతోంది. ఈ క్రమంలోనే..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రతాపం చూపుతోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజల్లో భయాందోళన రేపుతోంది. ఈ క్రమంలోనే వైరస్ సోకిన లక్షలమంది బాధితులు కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుతుండగా, కొందరు మాత్రం కరోనా పట్ల లేనిపోని అపోహాలు పెంచుకుంటున్నారు. వైరస్ సోకందనే భయంతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఓ వృద్ధ జంట కోవిడ్ భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కరోనా భయంతో వృద్ధ జంట ఆత్మహత్య చేసుకుంది. రాజ్‌భవన్ సమీపంలోని ఎంఎస్ మక్తాలో ఉన్న రాజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దంపతులు..కరోనా భయంతో కూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా..
దంపతులిద్దరూ పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. అయితే, తమకు కోవిడ్ సోకిందని.. తమ నుంచి ఇతర కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందనే భయంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.