CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మరింత విజృంభిస్తోంది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా 3లక్షల57వేల పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు...

CORONA SECOND-WAVE: దేశంలో కరోనా విలయ తాండవం.. లోకల్ లాక్‌డౌన్లతో కట్టడికి ప్రభుత్వాల యత్నం
Lockdown
Follow us
Rajesh Sharma

|

Updated on: May 04, 2021 | 7:49 PM

CORONA SECOND-WAVE LEADS LOCAL LOCK-DOWNS: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ (CORONA SECOND WAVE) రూపంలో మరింత విజృంభిస్తోంది. ఫలితంగా దేశంలో కరోనా (CORONA) బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా 3 లక్షల 57 వేల పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా 3 లక్షల 20 వేల 289 మంది కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. అయితే దురదృష్టవశాత్తు కరోనా వైరస్ (CORONA VIRUS) బారిన పడి ఒక్క రోజులోనే 3 వేల 449 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కోట్ల 2 లక్షల 82 వేలకు పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో కోటి 66 లక్షల 13 వేలకి పైగా మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో 2 లక్షల 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 34 లక్షల 47 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మరోవైపు వ్యాక్సినేషన్ (VACCINATION) ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

బీహార్ (BIHAR) కూడా లాక్‌డౌన్ (LOCK-DOWN) రాష్ట్రాల జాబితాలో చేరింది. మే 15 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (BIHAR CHIEF MINISTER NITISH KUMAR) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులు, అధికారులతో చర్చించిన తర్వాత లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించినట్టు నితీశ్ తెలిపారు. లాక్‌డౌన్‌కు సంబంధించి విధి విధానాలను, మార్గదర్శకాలను వెల్లడిస్తామన్నారు. క్యాబినెట్‌లోని మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత మే 15 వరకూ బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై వివరణాత్మక మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోవిడ్ సంక్షోభ నిర్వహణ బృందానికి సూచించామని సీఎం నితీశ్ వెల్లడించారు. బిహార్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ అమలకు నితీశ్ మొగ్గుచూపారు. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 11వేల407 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో బీహార్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.

దేశంలో కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కాగా రెండో దశ వైరస్‌ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుందని సదరు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై (MUMBAI)లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ , బెంగళూరు (BANGALORE)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన పరిశోధన గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి. ఈ రెండో దశలో అనేక మంది వైరస్‌ బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్‌ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శనం అని ఆ పరిశోధనలో వెల్లడైంది. ముంబయిలో కరోనా మరణాలు (CORONA DEATHS) అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్ర (MAHARASHTRA)లో రెండో దశ వైరస్‌ ఫిబ్రవరి (FEBRUARY) నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని పేర్కొంది. మే మొదటి వారంలో ముంబయిలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్‌ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలిపింది.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా, కీలక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్ష (JEE MAINS EXAM) వాయిదా వేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి అత్యంత తీవ్రస్థాయిలో ఉండడంతో వాయిదా వేశారు. తెలంగాణలో తగ్గినట్లే తగ్గిన కరోనా పాజిటివ్ కేసుల (CORONA POSITIVE CASES) సంఖ్య మళ్లీ పెరిగాయి. కొత్తగా 6 వేల 800 పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. తెలంగాణ (TELANGANA)లో 70వేల961 శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా వీరిలో 6వేల876 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 7,432 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్క రోజులోనే 59 మంది మృత్యువాత పడ్డారు.

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 641 బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఒక్కో బృందంలో ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజి వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి ధర్మోస్కానర్ తో ఒక్కరోజే 40వేల ఇళ్లలో సర్వే ను చేపట్టగా వీరిలో 1487 మంది జ్వరంతో ఉన్నారని గుర్తించారు. ఈ జ్వరంతో బాధపడుతున్న 1487 మందిలో 1400 మందికి వెంటనే కోవిడ్ మందుల కిట్ అందజేశారు. జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఫీవర్ సర్వేలో జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. సోమవారం నుండి నగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొన్నాయి. ఈ బృందాల సంఖ్య 641 కు పెరగడంతో నేడు ఒక్కరోజే 40 వేల ఇళ్లలో ఈ ఫివర్ సర్వే ముమ్మరంగా సాగింది. నగరంలోకి ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు అన్ని ఆసుపత్రుల్లో 18వేల600 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1లక్షా15వేల784 పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల 34 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే 82 మంది మృతి చెందారు. వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో మే 5వ తేదీ నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. దీనిపై తాజాగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతించింది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు సైతం నిలిచిపోనున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అటు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వచ్చేవారికి కరోనా టెస్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టులలో టెస్టులు చేయనుండగా.. నెగటివ్ వచ్చినవారిని ఇంటికి.. పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించనున్నారు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి కూడా టెస్టులు తప్పనిసరి చేశారు. అందుకోసం సరిహద్దుల్లో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ విషయమై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాయనున్నారు. సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.

రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని.. ఆక్సిజన్‌ అందక రోగులు చనిపోతే పరిస్థితేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కొవిడ్ పరీక్షల ఫలితాలు , వ్యాక్సినేషన్‌ వంటి కీలకాంశాలపై గంటన్నరకు పైగా విచారణ జరిపింది. మరణించిన వారికి గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ చికిత్సపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలను గురువారంలోపు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ALSO READ: ఐపీఎల్ మ్యాచ్‌ల వాయిదాతో తీరని నష్టం.. బీసీసీఐకి లాస్ ఎంతంటే?