అన్‌లాక్ 1.0.. ఆలయాల్లో ప్రారంభమైన దర్శనాలు

వేయి కనులతో ఎదురుచూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన తిరుమల ఏడుకొండల వాడి దర్శనం పునః ప్రారంభం అయ్యింది. మూడు రోజుల పాటు ట్రైల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు.

అన్‌లాక్ 1.0.. ఆలయాల్లో ప్రారంభమైన దర్శనాలు
Follow us

|

Updated on: Jun 08, 2020 | 10:09 AM

దాదాపు 80 రోజుల తర్వాత ఆలయాల్లో భక్తులకు దర్శనభాగ్యం లభిస్తోంది. దీని కోసం ప్రధాన ఆలయాల్లో కేంద్రం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తి తదితర ఆలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ, రేపు టీటీడీ ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా దర్శనాలను కల్పిస్తున్నారు. గంటలకు 500 మంది చొప్పున రోజుకు 6 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తొలి రెండు రోజులు ఆలయ ఉద్యోగులకు,10వ తేదీన స్థానికులకు, 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. దీనికోసం ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు.

అయితే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒక్కో హాల్లో 200 మంది చొప్పున నాలుగు హాళ్లలో నాలుగు విడతలకు వెయ్యి మందికి అన్నదానం అందించనున్నారు. ఆలయంలోకి వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి, అటు శానిటైజేషన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను ఇవాళ విడుదల చేస్తారు. రోజుకు 3 వేల ఆన్‌లైన్‌ టికెట్లను అందుబాటులో ఉంచనుంది టీటీడీ. తిరుపతిలోని టీటీడీ కౌంటర్లలో ప్రతిరోజు 3 వేల సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నారు. అటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో దర్శనాల కోసం ఎస్ఎంఎస్ ద్వారా టికెట్లు జారీ చేస్తారు.

ఇటు తిరుపతిలోని పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అమ్మవారి నైవేద్యం.. విరామ సమయం. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఇవాళ, రేపు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. 10వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగుల కార్యాలయ ప్రాంగణంలో దుర్గమ్మ టికెట్లను ఆదివారం నుంచే ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో కూడా టికెట్ల విక్రయాలను ప్రారంభిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి స్లాట్‌ ప్రకారం ఆరు వేల మందికి మాత్రమే ధర్మ దర్శనం, ముఖ మండప దర్శనం ఉంటుందని తెలిపారు.