కరోనా బులెటిన్ విడుదల.. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 44,489 కరోనా కేసులు నమోదు..
భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. తొలుత తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు.. వాతావరణంలో భారీ మార్పులు తదితర కారణాల వల్ల కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం..

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. తొలుత తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు.. వాతావరణంలో భారీ మార్పులు తదితర కారణాల వల్ల కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 44,489 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరింది. ఇదిలాఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 524 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,35,223కి చేరింది. కరోనాను జయించి 86,73,138 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.46 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు వాతావరణ మార్పులతో పాటు కాలుష్యం కూడా తోడవటంతో అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోనూ రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. కరోనా నిబంధనలు పాటించకుంటే రెట్టింపు ఫైన్ విధిస్తామంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా కర్ఫ్యూ విధించుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది.
