
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠం ఎక్కినప్పటి నుంచి రోజుకో బాంబ్ పేలుస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ అడ్మిన్ మరో సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఈ మేరకు వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం (మే 27) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబులు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించేలా విదేశీ విద్యార్థులు అమెరికన్ విద్యాసంస్థల్లో ప్రవర్తిస్తున్నారని, అందుకే ఈ విదేశీ విద్యార్ధి వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఈ చర్య వైట్ హౌస్, అమెరికా యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఆజ్యం పోసినట్లైంది. తొలుత హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యాసంస్థలపై కేంద్రీకృతమై ఉన్నట్లు కనిపించినా.. మొత్తం వర్సిటీల నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి పెడుతుండటంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు చాలామంది యూఎస్‌లో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
తాజా ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవివరంగా మరిన్ని నిబంధనలు త్వరలో అందే అవకాశముందని అందులో వివరించారు. ఇప్పటికే బుక్ చేసుకొన్న ఇంటర్వ్యూలు మాత్రం యథాతథంగా ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు. క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది డేవిడ్ లియోపోల్డ్ మాట్లాడుతూ.. ట్రంప్ పరిపాలన చర్య అంతర్జాతీయ విద్యార్థులకు, వారిపై ఆధారపడిన యుఎస్ యూనివర్సిటీలకు విపత్తు, వినాశకరమైనదని, అమెరికా అంతటా అనేక విద్యా సంస్థలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తుందని అన్నారు. ఆర్థిక ప్రభావాలు, సాంస్కృతిక ప్రభావాలు భారీగా తలెత్తే అవకాశం ఉందని లియోపోల్డ్ అన్నారు. ఇక్కడి వర్సిటీలు విదేశీ ప్రతిభను ఆకర్షించడం ద్వారా తమ ర్యాంకులను మరింతగా పెంచుకుంటున్నాయి. దాదాపు 19 మిలియన్ల మంది ఉన్న US ఉన్నత విద్య జనాభాలో అంతర్జాతీయ విద్యార్థులు 5.9% ఉన్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో, 1.1 మిలియన్లకు పైగా విదేశీ విద్యార్థులు USకి వచ్చారు. భారత్ నుంచి అత్యధికంగా వచ్చారు. ఆ తర్వా చైనా నుంచి వచ్చారు. యూఎస్‌కి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులలో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం చదువుతున్నారు. దాదాపు 25% మంది గణితం, కంప్యూటర్ సైన్స్ అభ్యసించగా, ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంజనీరింగ్‌ను ఎంచుకుంటున్నారు.
విదేశీ విద్యార్థులు కూడా సాధారణ విద్యార్ధుల మాదిరిగానే పూర్తి ట్యూషన్ చెల్లిస్తారు. విశ్వవిద్యాలయాలు విద్యార్ధులకు ఆర్థిక సహాయం అందించడానికి వీలు కల్పించే ఖర్చులను భర్తీ చేస్తారు. విదేశాంగ శాఖ స్పాన్సర్ చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. అత్యధిక విదేశీ విద్యార్థులు ఉన్న న్యూయార్క్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీల్లో దాదాపు 21,000పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వెట్టింగ్‌పై ట్రంప్ అడ్మిన్ దృష్టిసారింది. దీనిలో భాగంగా విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై కార్యచరణకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విధించిన కొన్ని ఆంక్షలపై ఇప్పటికే అమెరికాలోని పలు కోర్టుల్లో వ్యాజ్యాలు నమోదైన సంగతి తెలిసిందే.
స్టూడెంట్ వీసా నిలిపివేతపై న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి మాట్లాడుతూ.. అంతర్గత సమాచార మార్పిడిపై విదేశాంగ శాఖ వ్యాఖ్యానించదు. అయితే వీసా దరఖాస్తుదారులు యథతథంగా దరఖాస్తులను సమర్పించడం కొనసాగించవచ్చు. కాన్సులర్ అధికారులు తమ ముందున్న కేసులను US చట్టానికి అనుగుణంగా విచారించి, తీర్పు ఇవ్వడానికి సమయం పడుతుంది. యునైటెడ్ స్టేట్స్‌కు భద్రతకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా తగిన చర్యలు తీసుకోవడం కూడా ఇందులో భాగం. కాన్సులర్ విభాగాలు కేసుల విచారనకు షెడ్యూల్‌లను సర్దుబాటు చేసుకుంటాయని న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ప్రతినిధి తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.