Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC NDA NA 2023 Notification: ఇంటర్‌ అర్హతతో త్రివిధ దళాల్లో ప్రవేశాలకు ఎన్డీఏ, ఎన్‌ఏ 2023 నోటిఫికేషన్‌.. ఇలా ఎంపిక చేస్తారు..

దేశ సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువతకు చక్కటి అవకాశం. యూపీఎస్‌సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామ్‌ (1)-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సారి దాదాపు..

UPSC NDA NA 2023 Notification: ఇంటర్‌ అర్హతతో త్రివిధ దళాల్లో ప్రవేశాలకు ఎన్డీఏ, ఎన్‌ఏ 2023 నోటిఫికేషన్‌.. ఇలా ఎంపిక చేస్తారు..
UPSC NDA NA 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2022 | 1:47 PM

దేశ సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువతకు చక్కటి అవకాశం. యూపీఎస్‌సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామ్‌ (1)-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సారి దాదాపు 395 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రతీ ఏట రెండు సార్లు యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ప్రవేశాలకు నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. 2023 విద్యా సంవత్సరానికిగాను మొదటి విడత నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. 2024 జనవరి 2 నుంచి151వ కోర్సులో, 113వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. వీటి ద్వారా త్రివిధ దళాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అర్హులైన అవివాహిత యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

ఈ అర్హతలు తప్పనిసరి..

ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక కొలతలు కూడా ఉండాలి. ఎన్‌ఏ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసుకు సంబంధించి.. తప్పనిసరిగా 2 జులై 2004 నుంచి 1 జులై 2007ల మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 10, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్‌ 16, 2023న నిర్వహిస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షల్లో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపిక‌వుతారు. అలా ఎంపికైన‌వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చ‌ద‌వ‌చ్చు. ఈ విధంగా ఏడాది నుంచి 18 నెలలపాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఆయా కోర్సులు పూర్తి చేసినవారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో ఉద్యోగాలు పొందుకుంటారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం..

రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో..రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ – పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష.. రెండు పేపర్లకు ఉంటుంది. పేవర్-1 మ్యాథమేటిక్స్‌లో 300 మార్కులకుగానూ 2 గంటల్లో పరీక్ష ఉంటుంది. పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులకు రెండున్నర గంటల సమయంలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. రెండో దశలో.. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులను ఎస్‌ఎస్‌బీ నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు ఉంటాయి. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

విభాగాల వారీ ఖాళీలు ఇలా..

మొత్తం పోస్టులు..395

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 ఉన్నాయి. వీటిల్లో..

  • ఆర్మీ-208
  • నేవీ-42,
  • ఏయిర్‌ఫోర్స్- 120

మిగిలిన వాటిల్లో..

  • గ్రౌండ్ డ్యూటీ పోస్టులు 28
  • నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) పోస్టులు 25 ఉంటాయి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.