Unmarried Men Protest: పెళ్లికాని ప్రసాదుల పాట్లు.. పెళ్లి కావడంలేదంటూ రోడ్లపై వింత నిరసన..!
దేశంలో పెళ్లికాని ప్రసాదుల బాధలు చెప్పనలవికాని రీతిలో పెరిగిపోతున్నాయి. ఇలాగైతే లాభంలేదని భావించి ఏకంగా నిరసనలకు దిగారు ఈ రాష్ట్రంలోని బ్రహచారులు. వినూత్న పద్ధతిలో చేపట్టిన ఈ వింత నిరసనలు ప్రస్తుతం..
దేశంలో పెళ్లికాని ప్రసాదుల బాధలు చెప్పనలవికాని రీతిలో పెరిగిపోతున్నాయి. ఇలాగైతే లాభంలేదని భావించి ఏకంగా నిరసనలకు దిగారు ఈ రాష్ట్రంలోని బ్రహచారులు. వినూత్న పద్ధతిలో చేపట్టిన ఈ వింత నిరసనలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ సంగతేంటంటే..
మహారాష్ట్రలోని షోలాపుర్ జిల్లాలో పెళ్లి కాని యువకులు వరుడి వేషంలో ముస్తాబై గుర్రం ఎక్కి.. రోడ్లపై నిరసన చేపట్టారు. తమకు వివాహాలు జరగడం లేదని, పెళ్లి చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ అధ్యక్షుడు రమేష్ బరాస్కర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వీళ్లంతా వరుడి వేషధారణతో గుర్రాలపై కూర్చుని ఊరేగింపుగా వచ్చి శోలాపుర్ కలెక్టరేటు ఎదుట బైఠాయించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమేష్ బరాస్కర్ మాట్లాడుతూ..
పురుషులతో పోల్చితే మహారాష్ట్రలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ముఖ్యంగా షోలాపూర్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు కావడంలేదని, అందుకే లింగనిష్పత్తిలో గణనీయ మార్పులు తలెత్తాయని ఆరోపించారు. మనదేశంలో ఒక్క కేరళ రాష్ట్ర జనాభాలో మాత్రమే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 25 నుంచి 40 ఏళ్లలోపు పురుషులు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ పెళ్లిళ్లు కావడంలేదన్నారు. జిల్లా అధికారులు తమకు వధువులను చూసి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వింత నిరసనలు వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.