
హైదరాబాద్, జనవరి 14: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ 2026 నోటిఫికేషన్ వాయిదా పడింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల ఈ నోటిఫికేషన్ విడుదల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. యూపీఎస్సీ 2026 పరీక్షల క్యాలండర్ షెడ్యూల్ ప్రకారం ఈ నోటిఫికేషన్ జనవరి 14న విడుదల కావల్సింది ఉంది. అయితే పలు అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
త్వరలోనే యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3, 2026వ తేదీన ముగియనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 24న జరుగనుంది. సీఎస్‌ఈ ప్రకటన ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. గతేడాది 1,129 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ ఏడాది ఎన్ని పోస్టులు ఉంటాయనేది త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) 2025 పోస్టుల ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) విడుదల చేసింది. అభ్యర్ధులు ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్‌షీట్‌ను కూడా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలు నమోదు చేసి వీటిని పొందవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను జనవరి 16వ తేదీ వరకు రూ.50 చెల్లించి తెలుపవల్సి ఉంటుంది. కాగా ఈ ఆన్‌లైన్ రాత పరీక్షలు డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. ఢిల్లీ పోలీసు విభాగాల్లో మొత్తం 7,565 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.