న్యూఢిల్లీ, అక్టోబర్ 30: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏటా రెండు సార్లు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టును (యూజీసీ- నెట్) నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. యూజీసీ నెట్ జూన్ 2023 పరీక్షలకు సంబంధించిన కటాఫ్ వివరాలను సబ్జెక్టుల వారీగా యూజీసీ తాజాగా విడుదల చేసింది. జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు పేపర్ 1, 2లో 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు పేపర్ 1, 2లలో సాధిస్తే ఉత్తీర్ణులయినట్లు పరిగణిస్తారు.
యూజీసీ- నెట్ జూన్ 2023 సబ్జెక్టుల వారీగా కటాఫ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ బీ-ఫార్మసీ, ఫార్మ-డీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ అభ్యర్థులకు మొదటి 5 రోజులు ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఎంపీసీ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఫార్మసీ కాలేజీల్లో అనుమతులకు ఫార్మసీ కౌన్సిల్ గడువు పొడిగించడం వల్ల కౌన్సెలింగ్ కొంత ఆలస్యమైందని, ప్రవేశాలు త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.
తెలంగాణలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా నోటిఫికేషన్ ప్రకారం ఆ పోస్టులను భర్తీ చేశారు కూడా. కాగా నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయగా మిగిలిన జూనియర్ లైన్‌మెన్ పోస్టుల్లో రాత పరీక్షల్లో తరువాత అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలని ఎన్‌పీడీసీఎల్‌కు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత పరీక్షలో తరువాత అర్హత సాధించినవారిని స్తంభం ఎక్కడానికి నిర్వహించే పరీక్షకు కాల్‌లెటర్లు పంపాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం వారిని మిగిలిన పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తం తదుపరి మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
కాగా 2018లో 2,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిల్లో రాత పరీక్ష ద్వారా దాదాపు 2,325 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన 228 పోస్టులను భర్తీ చేయకపోవడంపై రాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. రాత పరీక్షలో అర్హత సాధించినా తమకు స్తంభం ఎక్కడానికి పరీక్షకు కాల్‌లెటర్లు పంపకపోవడాన్ని సవాలు చేస్తూ 12 మంది 2019లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టి కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.