UGC NET 2024 Admit Cards: యూజీసీ- నెట్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ

|

Dec 30, 2024 | 6:21 AM

యూజీసీ- నెట్‌ 2024 డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు యూజీసీ వీటిని విడుదల చేసింది. అభ్యర్ధులు తమ వివరాలు అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి..

UGC NET 2024 Admit Cards: యూజీసీ- నెట్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 3 నుంచి పరీక్షలు షురూ
UGC NET 2024 Admit Cards
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష మరో 3 రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను యూజీసీ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నెంబర్‌ నమోదు చేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగుతుంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి రెండో సారి పరీక్షను జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించాలని ఎన్టీయే నిర్ణయించింది.

యూజీసీ నెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. ఇది అర్హత పరీక్ష. ఇందులో అర్హత సాధించిన వారికి మాత్రమే పేపర్‌ 2ను పరిగణనలోకి తీసుకుంటారు. పేపర్‌ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పేపర్‌ 1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ మినహా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారు కనీసం 35 శాతం మార్కులను స్కోర్ చేయాల్సి ఉంటుంది.

కాగా ఈ ఏడాది నిర్వహించిన యూజీసీ నెట్‌ తొలి విడత పరీక్షలో పేపర్‌ లీకేజీ ప్రకంపనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో తొలి నుంచి ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్న యూజీసీ నెట్‌ పరీక్షలను ఈసారి నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పేపర్‌ లీకేజీలకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

యూజీసీ- నెట్‌ 2024 (డిసెంబర్) అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.