Mphil PHD: MPhil, PhD చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెద్ద ఊరటనిచ్చింది. ఎంఫిల్, పీహెచ్‌డీ థీసిస్‌ల సమర్పణకు చివరి తేదీని పొడిగించింది. దీనికి సంబంధించి యూజీసీ తన వెబ్‌సైట్ ugc.ac.inలో నోటీసును కూడా జారీ చేసింది. నోటీసు ప్రకారం.. ఎంఫిల్ పిహెచ్‌డి థీసిస్‌ను సమర్పించడానికి 6 నెలల అదనపు సమయం కేటాయించారు. మొదటి థీసిస్ సమర్పణకు చివరి తేదీ 31 డిసెంబర్ 2021. ఇప్పుడు అది 30 జూన్ 2022కి పెంచారు.
యూజీసీ అభ్యర్థులకు 6 నెలల అదనపు సమయం ఇవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు 16 మార్చి 2021న జారీ చేసిన నోటీసులో 6 నెలల సమయాన్ని పొడిగించారు. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా, రీసెర్చ్ స్కాలర్‌ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుజిసి తెలిపింది. Mhil లేదా PhD థీసిస్ సమర్పణ పెండింగ్‌లో ఉన్న విద్యార్థులందరికీ 30 జూన్ 2022 తేదీ వర్తిస్తుందని UGC నోటీసులో తెలియజేసింది.
థీసిస్‌ను సమర్పించడానికి అదనంగా ఇచ్చిన 6 నెలలు థీసిస్ ప్రచురణకు, రెండు కాన్ఫరెన్స్‌లలో ప్రదర్శనకు వర్తిస్తాయి. అంటే తమ థీసిస్‌ను ప్రచురించడానికి, రెండు సమావేశాలలో ప్రదర్శనలు ఇవ్వడానికి 30 జూన్ 2022 వరకు సమయం ఉంటుంది. అయితే ఏదైనా ఫెలోషిప్ ప్రయోజనం పొందుతున్న వారికి 5 సంవత్సరాలు మాత్రమే ఫెలోషిప్ మొత్తం ఇస్తారు. థీసిస్ సమర్పణ తేదీ పొడిగింపునకు ఫెలోషిప్ వర్తించదు.