హైదరాబాద్, డిసెంబర్ 6: హైదారాబాద్ లోని ప్రతిష్ఠాత్మక నల్సార్ యూనివర్సిటీపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కొరడా జులిపించింది. ఆ యూనివర్సిటీ అందిస్తున్న ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులపై నిషేధం విధించింది. 2024-25 విద్యాసంవత్సరంలో ఆ వర్సిటీ అందించే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సుల్లో ఎవరూ చేరొద్దని ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. నల్సార్ యూనివర్సిటీ ఆన్‌లైన్‌తోపాటు దూరవిద్యలోనూ పలు కోర్సులను అందిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ఇతరులూ ఆ కోర్సుల్లో చేరి చదువుకుంటున్నారు. అయితే, యూజీసీ నిబంధనలు పాటించకపోవడం, యూజీపీ లేవనెత్తిన పలు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఏడాది పాటు వర్సిటీ కార్యకలాపాలపై నిషేధం విధించింది.
ఏడాది నిషేధం తర్వాత మళ్లీ ఎప్పటిమాదిరిగానే నల్సార్ యూనివర్సిటీలో కోర్సులు చదవొచ్చని యూజీసీ పేర్కొంది. కాగా నల్సార్ యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎందరో ఈ వర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రఖాత వర్సిటీపై యూజీసీ నిషేధం విధించడానికి పలువురు నిపుణులు తప్పుబడుతున్నారు. ఇలా నిషేధం విధిస్తే భవిష్యత్తులో ఆ వర్సిటీపై విద్యార్ధులకు విశ్వాసం సన్నగిల్లే ప్రమాదముంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆ వర్సిటీ రిజిస్ట్రారుగా ఉన్న సమయంలో అంతరిక్షం, రక్షణకు సంబంధించి పలు వినూత్న కోర్సులను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ఎంతో మంది రక్షణ శాఖ ఉద్యోగులు లబ్ధి పొందారు. ఇప్పుడు వర్సిటీ కోర్సులను ఏడాదిపాటు నిషేధిస్తే ఆయా కోర్సులు చదవలేని పరిస్థితి నెలకొంది. దీనిపై నల్సార్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావును వివరణ కోరగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టైర్ 1 పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ నుంచి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.