TSPSC Group 4 Recruitment 2022: 9168 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్‌ – 4 నోటిఫికేషన్‌.. త్వరలో ప్రకటన!

|

May 20, 2022 | 3:46 PM

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ త్వరలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌లో టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌ 4 ఉద్యోగ ప్రకటన జారీకి..

TSPSC Group 4 Recruitment 2022: 9168 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్‌ - 4 నోటిఫికేషన్‌.. త్వరలో ప్రకటన!
Tspsc Group 4
Follow us on

TSPSC Group 4 Notification 2022 for 9168 vacancies: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ త్వరలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌లో టీఎస్‌పీఎస్సీ ద్వారా గ్రూప్‌ 4 ఉద్యోగ ప్రకటన జారీకి ప్రయత్నాలు (TSPSC Group 4 Notification 2022) ప్రారంభించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. బీఆర్‌కే భవన్‌లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విభాగాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Somesh Kumar) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే అనుమతించిన వాటితో పాటు మిగతా పోస్టులకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయన్నారు. గురుకుల నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని గురుకుల నియామక బోర్డుకు సూచించారు.

గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఉత్తర్వులు త్వరలోనే ప్రభుత్వం జారీచేయనున్నట్లు సీఎస్‌ వివరించారు. ఇప్పటికే గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా విభాగాధిపతులు నోటిఫికేషన్‌ జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రోస్టర్‌ విధానం అనుసరించి, రిజర్వేషన్లు ఖరారు చేయాలని, ప్రతి ప్రతిపాదనను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాస్థాయి పోస్టులు కావడంతో 33 జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంటుందని, ఈ మేరకు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ విభాగాధిపతులు నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలని కోరారు. 29 నాటికి టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు అందించాలని, ఆలోగా ప్రతి విభాగం కమిషన్‌ నుంచి సమయం తీసుకుని ప్రతిపాదనల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో చూసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని తెలిపారు.

ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను ఇప్పటికే ఆర్థికశాఖ క్రోడీకరించింది. ఈ సమాచారం ప్రకారం గ్రూప్‌-4 పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ విభాగాల వారీగా ఖాళీలను గుర్తించి, ఆ ప్రతిపాదనల్ని సంబంధిత విభాగాలు ఆర్థికశాఖకు అందించాయి. తొలుత ఇచ్చిన సమాచారంతో పోల్చితే, దాదాపు 10-15 విభాగాల్లో పోస్టులు తగ్గినట్లు సీఎస్‌ గుర్తించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో విభాగాధిపతుల నుంచి వివరణ అడిగారు. ప్రభుత్వ విభాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు తగ్గకూడదని, ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ విభాగాల్లో ఆర్థికశాఖ అనుమతించిన జూనియర్‌ అసిస్టెంట్‌, తత్సమాన స్థాయి పోస్టులను ప్రత్యక్ష నియామకం కింద నోటిఫై చేయాలని సీఎస్‌ సూచించారు. సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, తద్వారా ఏర్పడే జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలను నోటిఫై చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.